Himachal Pradesh : ఈ ఒప్పందం తెలంగాణ ప్రజలకు..గొప్ప ముందడుగు : భట్టి

తెలంగాణలో వేగంగా పెరుగుతోన్న విద్యుత్ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ (Clean and Green Energy Policy) -2025 ప్రకారం పర్యావరణ పరిరక్షణకు హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh) తో విద్యుత్ ఒప్పందం చేసుకోవడం గొప్ప ముందడుగని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) అన్నారు. విద్యుత్ భద్రతను పెంచుకునే అంశంలో రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్ర భాగస్వామ్యంతో ఆర్థికంగా మేలైనది, స్వచ్ఛమైన విద్యుత్‌ను పొందేందుకు ఈ ఒప్పందం గొప్ప ముందడుగన్నారు. హిమాచల్ రాజధాని శిమ్లాలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు (Sukhwinder Singh Sukhu) తో సమవేశమైన భట్టి, విద్యుత్ ఒప్పందం కుదుర్చుకున్నారు.
థర్మల్ పవర్‌తో పోల్చినప్పుడు హైడల్ పవర్ ఉత్పత్తి ( జల విద్యుత్) వ్యయం తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా థర్మల్ పవర్ ఉత్పత్తి ఖర్చు ఏటా పెరుగుతూ ఉండగా, హైడల్ విద్యుత్ ఉత్పత్తి ఖర్చు క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఎక్కువ జీవనదులు ఉన్న రాష్ట్రం కావడంతో సంవత్సరంలో 9 నుంచి 10 నెలల పాటు నిరంతర హైడల్ పవర్ ( జల విద్యుత్) ఉత్పత్తికి అనువుగా ఉంటుంది. ఈ ఒప్పందం ద్వారా తెలంగాణ ప్రజలకు తక్కువ ధరకు, పర్యావరణ హితమైన విద్యుత్‌ను అందించేందుకు అవకాశం ఉంటుంది. ఈ ప్రాజెక్టులను తెలంగాణ జెన్‌కో నామినేన్ విధానంలో చేపడుతుంది అని తెలిపారు.