Ramchander Rao: సర్దార్ సర్వాయి పాపన్న పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి: బీజేపీ చీఫ్ రాంచందర్ రావు

మొఘల్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా, పెత్తందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడిన మహానీయుడు సర్వాయి పాపన్న అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు (Ramchander Rao) పేర్కొన్నారు. సోమవారం నాడు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన పాపన్న జయంతి వేడుకల్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో పేద కుటుంబాలు, బడుగు బలహీన వర్గాల కోసం పోరాడి ప్రాణాలర్పించిన పాపన్న ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని రాంచందర్ రావు (Ramchander Rao) పిలుపునిచ్చారు. ట్యాంక్ బండ్‌పై సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్న బీజేపీ డిమాండ్‌ను అంగీకరించిన రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఆయన స్వాగతించారు. ఎక్కడ అన్యాయం జరిగినా ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాడటమే మార్గమని ఆయన సూచించారు. మొఘల్, బ్రిటిష్ పాలన కాలంలో మహిళలపై జరిగిన అత్యాచారాలు, అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడిన వీరుడు పాపన్న అని రాంచందర్ రావు (Ramchander Rao) గుర్తు చేశారు. ఈ సమాజంలో అన్యాయాలు, అఘాయిత్యాలు జరిగే ప్రతిసారీ పోరాడే స్ఫూర్తి ప్రతి ఒక్కరిలో ఉండాలని ఆయన అన్నారు.