Utah: రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి .. అమెరికా ప్రతినిధులను కోరిన మంత్రి శ్రీధర్‌బాబు
తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని అమెరికా వరల్డ్ ట్రేడ్ సెంటర్-యుటా (Utah) పారిశ్రామికవేత్తలకు ఐటీశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు (Sridhar Babu) పిలుపునిచ్చారు. స్వేచ్ఛాయుత పారిశ్రామిక విధానంలో తెలంగాణ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని, ఇక్కడ పారిశ్రామికాభివృద్ధికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు. సచివాలయంలో ఆయన్ను డబ్ల్యూటీసీ-యుటా ఎండీ, సీవోవో డేవిడ్ కార్లెబాగ్ నేతృత్వంలోని పారిశ్రామికవేత్తల బృందం మంత్రిని కలిసింది. ఈ సందర్భంగా టెక్నాలజీ, ఇన్నోవేషన్, ఏరోస్పేస్, డిఫెన్స్, అడ్వాన్స్డ్ మాన్యుఫ్యాక్చరింగ్, లైఫ్‌సైన్సెస్, ఏఐ (AI)అధారిత హెల్త్‌కేర్, క్లీన్ ఎనర్జీ, ఎడ్యుకేషన్, స్కిల్స్ తదితర రంగాల్లో యుటా తెలంగాణ మధ్య ద్వైపాక్షిక సహకారం, నైపుణ్యాల అవకాశాలపై చర్చించారు.రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై మంత్రి వారికి ప్రజంటేషన్ ఇచ్చారు.
అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థకు సహకారం అందించేలా, దీర్ఘకాలిక విలువ జోడిరచేందుకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. టీ-హబ్, వీ-హబ్‌లను డబ్ల్యూటీసీ-యుటా, సిలికాన్ స్లోప్స్ యుటా టెక్ స్టార్టప్‌లతో అనుసంధానం చేయాలి. ఏఐ, సైబర్ సెక్యూరిటీ తదితర కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్‌లో యూనివర్సిటీ ఆఫ్ యుటా, బీవైయూ, న్యూమాంట్ యూనివర్సిటీలతో రాష్ట్రంలోని ప్రముఖ విద్యాసంస్థలు కలిసి అకడమిక్, పరిశోధన కార్యక్రమాలు చేపట్టేలా చొరవ చూపాలి అని శ్రీధర్‌బాబు కోరారు. తెలంగాణతో కలిసి పనిచేసేందుకు యుటా సిద్ధంగా ఉందని సీవోవో డేవిడ్ కార్లెబాగ్ (David Carlebaugh) తెలిపారు.






