Supreme Court :తెలంగాణ ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టులో విచారణ

తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారంపై సుప్రీంకోర్టు (Supreme Court) లో విచారణ జరిగింది. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(Kaushik Reddy) దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ బీఆర్ గవాయ్ (BR Gavai), జస్టిస్ జార్జి మైస్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. హైకోర్టు(High Court) నాలుగు నెలల్లో ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకోవాలని గతేడాది మార్చిలో చెప్పినా ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదని కౌశిక్‌రెడ్డి తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. తగిన సమయంలో స్పీకర్ నిర్ణయం తీసుకోవడం లేదని తెలిపారు.
ఈ వ్యవహారంలో ఇప్పటికే ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చామని అసెంబ్లీ కార్యదర్శి తరపు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ (Mukul Rohatgi) కోర్టుకు తెలిపారు. దీనిపై నిర్ణయం తీసుకునేందుకు ఎమ్మెల్యేకు స్పీకర్ తగిన సమయం ఇవ్వాలని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఆయన గుర్తు చేశారు. ఎంత సమయం కావాలో స్పీకర్‌ను కనుక్కొని చెప్పాలని ముకుల్ రోహత్గీకి జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం సూచించింది. అనంతరం తదుపరి విచారణను వారం రోజులకు సుప్రీంకోర్టు వాయిదా వేసింది.