Sri Ganesh: కొందరి నుంచి ప్రాణహాని : ఎమ్మెల్యే శ్రీగణేశ్

తనపై జరిగిన దాడి యత్నం ఘటనపై కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్ (Sri Ganesh ) స్పందించారు. కొంతమంది రౌడీషీటర్లు దాడి చేసేందుకు కుట్ర పన్నారని తెలిపారు. తనకు ప్రాణహాని ఉందని పోలీసుల (Police)కు చెప్పానన్నారు. ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారని వివరించారు. తనపై దాడి చేయడానికి కొంతమంది యువకులు యత్నించినట్లు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్ ఓయూ ఠాణా (OU Police Station) లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఓయూ సమీపంలోని మాణికేశ్వర్‌నగర్ (Manikeshwarnagar) ( వడ్డేర బస్తీ)లో బోనాల (Bonalu) సందర్భంగా ఆదివారం రాత్రి ఫలహారం బండి ఊరేగింపు కార్యక్రమానికి వెళ్తుండగా సుమారు 50 మంది దుండగులు ఎదురుగా వచ్చారని ఆయన చెప్పారు. సుమారు 20 బైక్‌లపై వచ్చి తన వాహనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారని తెలిపారు. తనను కారులోంచి కిందకి దిగాలని బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.