Speaker: ఎమ్మెల్యేలు దానం, కడియంలకు మరోసారి స్పీకర్ నోటీసులు
బీఆర్ఎస్ పార్టీ దాఖలు చేసిన అనర్హత పిటిషన్లపై తక్షణమే అఫిడవిట్ రూపంలో వివరణ ఇవ్వాలంటూ ఖైరతాబాద్, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యేలు దానం నాగేందర్ (Danam Nagender), కడియం శ్రీహరి (Kadiyam Srihari)లకు గురువారంనాడు స్పీకర్ ప్రసాద్‌కుమార్ (Speaker Prasad Kumar,), నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. తమ పార్టీ టికెట్‌పై గెలిచిన దానం నాగేందర్, కడియం శ్రీహరి సహా పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారని, వారిపై అనర్హత వేటు వేయాలని కోరుతూ స్పీకర్ ప్రసాద్‌కుమార్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై వారు సుప్రీం కోర్టు (Supreme Court)నూ ఆశ్రయించారు. ఆ పది మంది ఎమ్మెల్యేలపైదాఖలైన పిటిషన్లపైన విచారణ ప్రక్రియను అక్టోబరు 31 కల్లా పూర్తి చేయాలంటూ కోర్టు ఆదేశాలూ జారీ చేసింది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు విచారణ ప్రక్రియను చేపట్టిన స్పీకర్ ప్రసాద్‌కుమార్ పది మంది ఎమ్మెల్యేలకూ నోటీసులు జారీ చేశారు.
ఈ పది మంది ఎమ్మెల్యేలలో దానం నాగేందర్, కడియం శ్రీహరిలు మినహా మిగిలిన 8 మంది ఎమ్మెల్యేలూ అఫిడవిట్ల రూపంలో వివరణ ఇచ్చారు. వాటిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అభ్యంతరాలు చెప్పడం, ఆ 8 మంది ఎమ్మెల్యేలపై విచారణ ప్రక్రియను చేపట్టడం వెంటవెంటనే జరిగాయి. విచారణ ప్రక్రియ నడుస్తున్న నేపథ్యంలో స్పీకర్ కార్యాలయం సుప్రీం కోర్టును మరికొంత గడువు కోరింది. అయితే బీఆర్ఎస్ పార్టీ మరోమారు సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో నాలుగువారాల్లో విచారణ ప్రక్రియ ముగించాల్సిందిగా స్పీకర్‌కు అత్యున్నత న్యాయస్థానం సూచన చేసింది. ఈ నేపథ్యంలో బుధవారంనాటికి ఆరుగురు ఎమ్మెల్యేలపై దాఖలైన పిటిషన్లపైన విచారణను స్పీకర్ పూర్తి చేశారు. గురువారంనాడు పోచారం శ్రీనివా్‌సరెడ్డి, అరికెపూడి గాంధీలపై దాఖలైన పిటిషన్లపై విచారణ ముగించారు. ఈ 8 పిటిషన్లపైన స్పీకర్ తన నిర్ణయం వెలువరించాల్సి ఉంది. కాగా, 8 మందితో పాటుగా నోటీసులు అందుకున్న దానం నాగేందర్, కడియం శ్రీహరి వివరణ ఇవ్వడానికి అప్పట్లో సమయం కోరారు. విచారణ ప్రక్రియను ముగించేందుకు సుప్రీం కోర్టు నాలుగు వారాలు గడువు ఇచ్చిన నేపథ్యంలో ఆ ఇద్దరికీ స్పీకర్ మరోసారి నోటీసులు జారీచేశారు.






