Congress: ఒక్కో వార్డుకు ఆరుగురు ఆశావహుల ఎంపిక : కాంగ్రెస్
పంచాయతీ ఎన్నికల అనుభవాలతో రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ముందుజాగ్రత్తలు తీసుకోవాలని కాంగ్రెస్ (Congress) నిర్ణయించింది. మున్సిపల్ ఎన్నికల్లో మెజారిటీ సీట్ల సాధనకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది. పార్టీ తరపున అంతర్గతంగా క్షేత్రస్థాయి సర్వే నిర్వహించనుంది. ప్రజల అభిప్రాయాలను సేకరించి, కాంగ్రెస్ తరపున పోటీ చేసేందుకు ఒక్కో వార్డుకు ఆరుగురి చొప్పున ఆశావహుల్ని ఎంపిక చేయాలని యోచిస్తోంది. శాసనసభలో ముఖ్యమంత్రి ఛాంబర్ రేవంత్ రెడ్డి (Revanth Reddy)తో పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) సమావేశమై పలు అంశాలపై చర్చించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
ప్రధానంగా ఈ నెల 8న గాంధీభవన్‌లో జరిగే పీసీసీ విస్తృతస్థాయి సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై నేతలు మాట్లాడుకున్నట్లు సమాచారం. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకం పేరును కేంద్ర ప్రభుత్వం మార్చడంపై కాంగ్రెస్ తరపున రాష్ట్రంలో చేపట్టాల్సిన ఆందోళన కార్యక్రమాల గురించి చర్చించినట్లు తెలిసింది. కృష్ణా జలాలపై అసెంబ్లీలో ప్రభుత్వం ఇచ్చిన ప్రజంటేషన్‌తో ప్రజలకు మంచి సమాచారం అందిందని సీఎంతో మహేశ్‌కుమార్ గౌడ్ అన్నట్లు సమాచారం.






