KTR: తిట్ల దండకంలో తండ్రినే మించిపోతున్న కేటీఆర్?
తెలంగాణ రాజకీయ యవనికపై ఇప్పుడు ప్రజా సమస్యల చర్చ కంటే.. వ్యక్తిగత దూషణలు, అసభ్య పదజాలమే ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఒకప్పుడు ఉద్యమ సెగతో రగిలిన తెలంగాణ గడ్డపై ఇప్పుడు రాజకీయ కక్షలు – బూతుల పర్వాలు రాజ్యమేలుతున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వైఖరి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తన తండ్రి కేసీఆర్ వేసిన తిట్ల బాటలో నడుస్తూ.. ఇప్పుడు ఆయననే మించిపోతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ వాడిన భాష ఒక ఆయుధంగా పనిచేసింది. సమైక్య పాలకులను ఉద్దేశించి ఆయన వాడిన పిచ్చోళ్లు, దెబ్బకు దెయ్యం వదులుతది వంటి పదాలు అప్పట్లో ఉద్యమకారుల్లో ఉత్సాహాన్ని నింపాయి. అయితే, అధికారం వచ్చాక కూడా అదే ధోరణి కొనసాగడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. చివరకు 2024 ఎన్నికల సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం కూడా కేసీఆర్ వాడిన అన్ పార్లమెంటరీ భాషపై సీరియస్ అయ్యి నోటీసులు ఇచ్చిందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
బీఆర్ఎస్ పదేళ్ల పాలనకు చెక్ పెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, అదే భాషా యుద్ధాన్ని కొనసాగిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా గానీ, బహిరంగ సభల్లో గానీ బీఆర్ఎస్ నేతలపై విరుచుకుపడుతున్నారు. 2025 డిసెంబర్ నాటి అసెంబ్లీ సమావేశాల్లో రేవంత్ రెడ్డి వాడిన కొన్ని పదాలు సభ్య సమాజాన్ని విస్మయానికి గురిచేశాయి. అలాగే సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేసేవారిని బట్టలు ఊడదీసి పరేడ్ చేస్తాం అనడం ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఒక ముఖ్యమంత్రికి తగదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
విదేశాల్లో చదువుకుని, కార్పొరేట్ శైలిలో రాజకీయాలు చేస్తారని పేరున్న కేటీఆర్.. ఓటమి తర్వాత పూర్తిస్థాయిలో రూటు మార్చారు. రేవంత్ రెడ్డి విమర్శలకు కౌంటర్ ఇచ్చే క్రమంలో ఆయన కూడా సంయమనం కోల్పోతున్నారు. తాజాగా ఖమ్మంలో కేటీఆర్ వాడిన పదజాలం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీలను కేటీఆర్ అసభ్యపదజాలంతో దూషించారు. రేవంత్ రెడ్డిని గూండాగిరి చేస్తున్నారని విమర్శిస్తూనే, కేటీఆర్ కూడా అదే స్థాయి పదజాలంతో విరుచుకుపడుతున్నారు. ఎక్స్ వేదికగా రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తూ వ్యక్తిగత దూషణలకు దిగడం కేటీఆర్ ఇమేజ్‌కు డ్యామేజ్ కలిగిస్తోందనే వాదన వినిపిస్తోంది.
రాజకీయాల్లో విమర్శలు ప్రతివిమర్శలు సహజం. కానీ, అవి లక్ష్మణ రేఖను దాటకూడదు. “రేవంత్ తిడుతున్నారు కాబట్టి మేము కూడా తిడతాం” అని బీఆర్ఎస్ సమర్థించుకోవడం ఆ పార్టీ నైతికతను దెబ్బతీస్తుంది. కేటీఆర్ లాంటి విద్యావంతుడైన నాయకుడు ఈ తిట్ల సంస్కృతికి చరమగీతం పాడి, ఒక కొత్త తరహా రాజకీయాలకు నాంది పలకాల్సిన అవసరం ఉంది. లేనిపక్షంలో, అధికార-ప్రతిపక్షాల మధ్య జరుగుతున్న ఈ బూతుల యుద్ధంలో అసలైన ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతుంది. తెలంగాణ ప్రజలు చైతన్యవంతులు. వారు నేతల నోటి వెంట తిట్లు కాదు.. తమ సమస్యలకు పరిష్కారాలు కోరుకుంటున్నారు. ఈ నిజాన్ని నాయకులు ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది.






