KTR:సింగపూర్ తెలుగు స్వర్ణోత్సవాలకు కేటీఆర్‌కు ఆహ్వానం

సింగపూర్‌లోని ప్రముఖ తెలుగు సాంస్కృతిక సంస్థ సింగపూర్ తెలుగు సమాజం (Singapore Telugu Samajam) తన స్వర్ణోత్సవ వేడుకలకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ప్రధాన అతిథిగా ఆహ్వానించింది. ఆగస్టు 31 తేదీన మేరీనా బే సాండ్స్ (Marina Bay Sands) సింగపూర్ వేదికగా ఈ వేడుకలు జరగనున్నాయి. ఈ మేరకు కేటీఆర్‌కు సింగపూర్ తెలుగు సమాజం అధ్యక్షుడు బొమ్మారెడ్డి శ్రీనివాసరెడ్డి (Srinivasa Reddy) అధికారికంగా లేఖ రాశారు. తెలుగు భాషాసంస్కృతిక సంప్రదాయాల పరిరక్షణ కోసం సింగపూర్ తెలుగు సమాజం కృషి చేస్తుందని శ్రీనివాసరెడ్డి ఆ లేఖలో తెలిపారు. సింగపూర్‌లో ఉండే తెలుగు ప్రజల మధ్య ఐక్యత పెంపొందించేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని పేర్కొన్నారు. తెలంగాణ సాంస్కృతిక, రాజకీయ వారసత్వానికి ప్రతినిధి అయిన కేటీఆర్ రాక సింగపూర్ తెలుగు సమాజానికి స్ఫూర్తిగా నిలుస్తుందని వ్యాఖ్యానించారు. ఈ స్వర్ణోత్సవ వేడుకల్లో పాల్గొని తమ సంస్థకు గౌరవం ఇవ్వాల్సిందిగా ఆయన కేటీఆర్‌ను కోరారు.