హైదరాబాద్ కు మరో జాతీయ స్థాయి సంస్థ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వినూత్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు సహా విద్యా రంగానికి, నూతన ఆవిష్కరణలకు చేయూతను అందిస్తున్న నేపథ్యంలో జాతీయ స్థాయి సంస్థ హైదరాబాద్‌లో ఏర్పాటు కానుంది. మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి ట్రస్ట్ ఢిల్లీ ఆధ్వర్యంలో నైపుణ్య అభివృద్ధి సంస్థ (స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్)ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసేందుకు ట్రస్ చైర్మన్, లాల్ బహదూర్‌శాస్త్రి కుమారుడు అనిల్ శాస్త్రి ముందుకొచ్చారు. అనిల్ శాస్త్రి, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్‌కుమార్ బీఆర్కే భవన్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌తో సమావేశమయ్యారు. నైపుణ్య అభివృద్ధి సంస్థ స్థాపనకు సహకారం అందిస్తామని సీఎస్ తెలిపారు. యువతకు నైపుణ్య అభివృద్ధిలో శిక్షణతోపాటు వివిధ కోర్సులను ఈ సంస్థ నిర్వహించనున్నదని అనిల్ శాస్త్రి తెలిపారు. సంస్థ స్థాపనకు హైదరాబాద్ అనువైన ప్రాంతమని పేర్కొన్నారు.
హైదరాబాద్‌లో సంస్థను నెలకొల్పేందుకు అనిల్ శాస్త్రి ముందుకొచ్చారని వినోద్‌కుమార్ తెలిపారు. ప్రభుత్వ పరంగా అన్ని రకాల సహకారాన్ని అందిస్తామని వినోద్ హామీనిచ్చారు. సింగపూర్‌లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఐటీఆ)తో కలిసి నైపుణ్యాభివృద్ధి సంస్థను ఏర్పాటు చేస్తామని ట్రస్ట్ డైరెక్టర్ శ్రీవాస్తవ తెలిపారు. ఈ సమావేశంలో ట్రస్ట్ సలహాదారు పాండురెడ్డి పాల్గొన్నారు.






