Saudi Arabia: సౌదీ అరేబియాలో ప్రమాదం.. అధికారులను అప్రమత్తం చేసిన సీఎం రేవంత్ రెడ్డి
సౌదీ అరేబియా (Saudi Arabia) లో ఇవాళ ఘోర రోడ్డు ప్రమాదంచోటుచేసుకుంది. బస్సు (Bus), ట్యాంకర్ (Tanker) ఢీకొన్న ఈ ఘటనలో 42 మంది చనిపోయినట్లు తెలుస్తోంది. మృతుల్లో 20 మంది మహిళలు కాగా, 11 మంది చిన్నారులు ఉన్నారు. వీరంతా మక్కా నుంచి మదీనా వెళ్తున్న భారతీయ యాత్రికులు కావటం గమనార్హం. బదర్, మదీనా (Medina) మధ్య ముఫరహత్ దగ్గర ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో ఎక్కువమంది తెలంగాణ (Telangana) వారు ఉన్నారు.అయితే, ఈ ఘోర ప్రమాదంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy)దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంపై సీఎం వెంటనే స్పందించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవాలని రాష్ట్ర సీఎస్ రామకృష్ణారావు, డీజీపీ శివధర్‌రెడ్డిని ఆదేశించారు.
ఈ ఘటనలో తెలంగాణ కు చెందిన వారు ఎంతమంది ఉన్నారో వెంటనే తెలుసుకోవాలని అధికారులను ఆదేశించారు సీఎం. కేంద్ర విదేశాంగ శాఖ, సౌదీ ఎంబస్సీ అధికారులతో మాట్లాడాలని అధికారులకు సూచించారు. అవసరమైతే వెంటనే తగిన సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో సీఎస్ రామకృష్ణారావు ఢిల్లీలోని రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్‌ను అప్రమత్తం చేశారు. ఈ ప్రమాదంలో తెలంగాణకు చెందిన వారు ఎంతమంది ఉన్నారనే వివరాలు సేకరించి వెంటనే అందించాలని కోరారు సీఎస్ రామకృష్ణారావు.సౌదీలో జరిగిన బస్సు ప్రమాద బాధిత కుటుంబాలకు తగిన సమాచారాన్ని, సహాయ సహకారాలు అందించేందుకు సచివాలయంలో కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్లు ఏర్పాటు చేసినట్లు సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. సౌదీ అరేబియా ఘటనకు సంబంధించి పూర్తి వివరాల కోసం +91 79979 59754, +91 99129 19545 ఈ నెంబర్లలలో సంప్రదించాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు.






