Revanth Reddy: వీడియో కాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా కోటి మంది మహిళలకు కోటి ఇందిరమ్మ చీరల పంపిణీని ప్రారంభించుకున్నాం. ఆడబిడ్డలకు సారె, చీర పెట్టడం తెలంగాణ సంప్రదాయం. ఇందులో భాగంగా ఆడబిడ్డలకు ఇందిరమ్మ చీరలను పంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రక్రియకు సంబంధించి ప్రతీ నియోజకవర్గానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించాలి. నియోజకవర్గాల్లోని అన్ని మండల కేంద్రాల్లో విడతల వారీగా ప్రజా ప్రతినిధుల ఆధ్వర్యంలో ఇందిరమ్మ చీరల పంపిణీ చేపట్టాలి. ఒక పండగ వాతావరణంలో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టాలి. మహిళల ఉన్నతి- తెలంగాణ ప్రగతి కార్యక్రమం పేరుతో ఇందిరమ్మ చీరల పంపిణీ చేపట్టండి. మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పించడమే కాదు.. వాటికి మహిళలను యజమానులను చేశాం.
స్కూల్స్ లో యూనిఫారం కుట్టే కుట్టుపని బాధ్యత మహిళా సంఘాలకే అప్పగించాం. ఇందిరమ్మ క్యాంటీన్లు, శిల్పారామంలో 3 ఎకరాల్లో ఇందిరా మహిళా శక్తి బజార్ ఏర్పాటు చేశాం. ఆన్ లైన్ మార్కెట్ కోసం అమెజాన్ తో సంప్రదింపులు చేస్తున్నాం. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మహిళలు తయారు చేసిన ఉత్పత్తులకు గుర్తింపు తెచ్చే ప్రయత్నం చేస్తున్నాం. కోటి మంది మహిళలలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు వెళుతోంది. పూర్తి వివరాలతో ప్రతీ మహిళకు ఇందిరమ్మ చీరలు అందేలా అధికారులు పారదర్శకంగా వ్యవహరించాలి. గ్రామీణ ప్రాంతాల్లో ఇవాళ్టి నుంచి డిసెంబర్ 9 వరకు ఇందిరమ్మ చీరల పంపిణీ ఉంటుంది. మార్చి 1 నుంచి 8 వరకు పట్టణ ప్రాంతాల్లో ఇందిరమ్మ చీరల పంపిణీ ఉంటుంది. కోటి మంది మహిళలకు కోటి చీరలు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వివాదాలకు తావు లేకుండా ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రక్రియ పూర్తి చేయాలి.






