CM Revanth Reddy: నిజమైన ఉద్యమకారులెవరూ గొప్పలు చెప్పుకోలేదు: సీఎం రేవంత్

హసిత భాష్పాలు పుస్తకాన్ని రచించిన కవి అందెశ్రీని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. ఈ పుస్తకాన్ని ఆవిష్కరించిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ సమాజం కవులకు, ఉద్యమానికి స్ఫూర్తినిచ్చిన పుణ్యభూమి అని కొనియాడారు. తెలంగాణ ఉద్యమంలో ఎందరో కవులు ప్రజలను ఉత్తేజపరిచారని ఆయన (CM Revanth Reddy) అన్నారు. గూడ అంజన్న, దాశరథి, కాళోజీ, అందెశ్రీ, గద్దర్, గోరెటి వెంకన్న వంటి కవులు ఉద్యమానికి వెన్నెముకగా నిలిచారని గుర్తు చేశారు.
అయితే కొంతమంది నకిలీ ఉద్యమకారులు తామే ఉద్యమకారులమని చెప్పుకుంటూ తిరుగుతున్నారని రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) విమర్శించారు. దీనికి కారణం, నిజమైన ఉద్యమకారులు ఎవరూ కూడా తాము ఉద్యమకారులమని గొప్పలు చెప్పుకోకపోవడమేనని ఆయన అభిప్రాయపడ్డారు. నిజమైన పోరాట యోధులు గర్వంగా తమ కృషిని చాటుకోవాలని, వారి వల్లే తెలంగాణ సాకారమైందని సీఎం అన్నారు. రాజకీయాల్లో తాను ఎవరినీ శత్రువులుగా చూడనని, అలా చూడాలంటే వారికి ఆ స్థాయి ఉండాలని రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) వ్యాఖ్యానించారు.