Revanth Reddy: ఈ గెలుపుతో తమ బాధ్యత మరింత పెరిగింది : సీఎం రేవంత్ రెడ్డి
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలుపుతో తమ బాధ్యత మరింత పెరిగిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) అన్నారు. ఉప ఎన్నికలో విజయం సాధించిన అనంతరం రేవంత్ రెడ్డి విలేకరులతో మాట్లాడారు. 51 శాతం ఓట్లతో ప్రజలు కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించారని, రెండేళ్ల పాలనను పూర్తి చేసుకుంటున్న సందర్భంలో జూబ్లీహిల్స్ (Jubilee Hills) నియోజకవర్గ ప్రజలు కాంగ్రెస్‌ను ఆశీర్వదించారని తెలిపారు. అభివృద్ధి కార్యాచరణతో ముందుకు వెళ్లండి, బాధ్యతతో కార్యక్రమాలను నిర్వహించండి అంటూ దీవించారని పేర్కొన్నారు. తాము దీన్ని బాధ్యతగా స్వీకరిస్తామని, హైదరాబాద్ మహా నగరాన్ని మరింత అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఎన్నికల్లో నెగ్గితే పొంగిపోవడం, ఓడితే కుంగిపోవడం కాంగ్రెస్‌కు తెలియదని, ప్రతిపక్షంలో ఉంటే ప్రజా సమస్యలపై పోరాడడం, ప్రభుత్వంలో ఉంటే సమస్యల పరిష్కారానికి ప్రయత్నించడమే తెలుసని అన్నారు. అందుకే ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా పార్టీ ఇంకా మనుగడ సాగిస్తూనే ఉందన్నారు. 51 శాతం ఓట్లతో కాంగ్రెస్‌కు ఎన్నడూ లేనంత బలం వచ్చిందని తెలిపారు. ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ (BRS) కు 38 శాతం , బీజేపీ (BJP)కి 8 శాతం ఓట్లు వచ్చాయని వివరించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేగా గెలిచిన నవీన్ యాదవ్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్, పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్క, వాకిటి శ్రీహరి, వివేక్ పాల్గొన్నారు.






