Harish Rao: మాజీ మంత్రి హరీశ్ రావుకు హైకోర్టులో ఊరట

మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావుకు తెలంగాణ హైకోర్టు (High Court) లో ఊరట లభించింది. పంజాగుట్ట పోలీసు స్టేషన్లో నమోదైన కేసు విషయంలో ఆయన్ను అరెస్టు చేయవద్దని ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. పోలీసులు తదుపరి దర్యాప్తు చేపట్టవచ్చని పేర్కొంది. ఇందుకు హరీశ్రావు సహకరించాలని సూచించింది. ఆయనపై ఫిర్యాదు చేసిన చక్రధర్ గౌడ్(Chakradhar goud) కు నోటీసులు జారీ చేస్తూ విచారణను వాయిదా వేసింది. హైదరాబాద్ పంజాగుట్ట పోలీసుస్టేషన్ లో ఆ స్థిరాస్తి వ్యాపారి జి,చక్రధర్గౌడ్ రాజకీయ కక్షతో ఇచ్చిన ఫిర్యాదు మేరకు నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ హరీశ్రావు (Harish Rao) హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డారంటూ తనతోపాటు రాధాకిషన్రావు తదితరులపై చక్రధర్గౌడ్ ఇచ్చిన ఫిర్యాదులోని అంశాలపై పోలీసులు ప్రాథమిక విచారణ జరపకుండానే కేసు నమోదు చేశారన్నారు. ఫిర్యాదులో తనకు వ్యతిరేకంగా ఏమీ లేదని, దాన్ని కట్టుకథతో దాఖలు చేశారన్నారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు అరెస్ట్ చేస్తే తన రాజకీయ జీవితంతోపాటు ప్రతిష్ట దెబ్బతింటాయన్నారు. ఫోన్ ట్యాపింగ్ అనేది ఎప్పుడో జరిగిన సంఘటన అని, ఇంతవరకు పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదన్నారు. ఆయన పిటిషన్పై హైకోర్టు విచారణ చేపట్టింది.