DELHI: చార్జీలు పెంచితే చూస్తూ ఊరుకోం.. విమానయాన సంస్థలకు కేంద్రం హెచ్చరిక
ఇండిగో సంక్షోభం.. మిగిలిన విమానయాన సంస్థలకు వరంలా మారింది. ఎందుకంటే దేశీయ సర్వీసుల్లో దాదాపు 60 శాతం ఇండిగోవి మాత్రమే ఉన్నాయి. ఈ విమానాలు రద్దు కావడంతో ప్రయాణికులు ప్రత్యామ్నాయాలపై ఫోకస్ పెట్టారు. ఫలితంగా విమాన టికెట్ల ధరలకు రెక్కలొచ్చాయి. అవి ఆకాశయానం చేస్తూ సామాన్యుడికి అందనంత ఎత్తుకు ఎగిరిపోయాయి.
ఇండిగో సర్వీసుల రద్దు కావడంతో ఇతర విమానయాన సంస్థలు టికెట్ ధరలను భారీగా పెంచేశాయి. సాధారణ ధరల కంటే ఏకంగా మూడు నుంచి పది రెట్లు అధికంగా టికెట్లు విక్రయిస్తున్నాయి. ప్రధాన నగరాల మధ్య ఒక్కరోజు ప్రయాణానికి సంబంధించిన టికెట్ ధరలు ఆకాశాన్ని తాకాయి. శుక్రవారం ఢిల్లీ – బెంగళూరు విమాన టికెట్ ధర రూ.1,02,000, చెన్నై – ఢిల్లీకి రూ. 90,000 లకు చేరింది. ఢిల్లీ – ముంబై టికెట్ ధర ఏకంగా రూ.54,222 పలికింది. ముంబై – శ్రీనగర్ మార్గంలో సాధారణంగా రూ.10 వేల లోపు ఉండే టికెట్ ధర, ఇప్పుడు రూ.62,000కు పెరిగింది.
ఇండిగో విమానాల రద్దుతో ఏర్పడిన సంక్షోభాన్ని ఇతర విమానయాన సంస్థలు అవకాశంగా మలుచుకున్నాయి. టికెట్ ధరలను భారీగా పెంచాయి. దీనివల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించింది. విమానయాన సంస్థలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. టికెట్ ధరల పెంపుపై కేంద్ర విమానయాన శాఖ జోక్యం చేసుకుంది. ఇండిగో సర్వీసులు రద్దయిన మార్గాల్లో టికెట్ ధరలను క్రమబద్ధీకరించింది. కొత్తగా నిర్ణయించిన ఛార్జీలను తప్పనిసరిగా పాటించాలని అన్ని విమానయాన సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. పరిస్థితులు పూర్తిగా సాధారణ స్థితికి వచ్చేవరకు ఈ ఆదేశాలు పాటించాలని తెలిపింది.
మరోవైపు.. ఇండిగో సంక్షోభంగా ఐదో రోజుకి అడుగపెట్టింది. దేశంలోని పలు ప్రధాన నగరాల ఎయిర్‌పోర్టుల వద్ద ప్రయాణికుల నిరీక్షణ కొనసాగుతోంది. ప్రయాణికులకు ముందస్తు సమాచారం ఇవ్వడంలో ఎయిర్‌లైన్స్ ఘోరంగా విఫలం అయ్యిందనే విమర్శ బలంగా వినిపిస్తోంది. విమానాల రద్దు గురించి తెలీక.. సరైన సమాచారం లేక.. ఎయిర్‌పోర్టులలో హెల్ప్‌డెస్క్‌ల వద్ద ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో.. ఇండిగో సిబ్బంది తమతో మూర్ఖంగా వ్యవహరిస్తున్నారని ప్రయాణికులు వాపోతున్నారు. ‘‘క్షమాపణలు చెప్పి చేతులు దులుపుకుంటే సరిపోతుందా?’’ అంటూ ఎయిర్‌లైన్స్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.






