AP Farmers: రిజిస్ట్రేషన్ పై భారీ రాయతి..రైతులకు ఊరట ఇచ్చిన ఏపీ ప్రభుత్వం..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు భారీ ఉపశమనాన్ని అందించేలా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా వారసత్వంగా వచ్చే వ్యవసాయ భూముల విషయంలో ఎప్పటి నుంచో ఉన్న రిజిస్ట్రేషన్ సమస్యలను దృష్టిలో పెట్టుకుని, రిజిస్ట్రేషన్ ఛార్జీలను గణనీయంగా తగ్గిస్తూ కొత్త విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ఆదేశాల మేరకు ఇప్పటికింకా భారంగా ఉన్న స్టాంపు డ్యూటీ (Stamp Duty) ఫీజును నామమాత్రంగా మార్చారు.
రాష్ట్రంలో చాలాకాలంగా వారసత్వ భూములు సక్రమంగా రిజిస్టర్ చేయకపోవడం వల్ల అనేక సమస్యలు ఉత్పన్నమయ్యాయి. పెద్దలు ఉన్నప్పుడు అన్నదమ్ముల మధ్య నోటి మాటగా లేదా కాగితంపై రాసుకుని ఆస్తి భాగస్వామ్యం చేసుకునేవారు. కానీ అలా రాసిన పత్రాలు చట్టబద్ధ రిజిస్ట్రేషన్ కాకపోవడంతో తరువాతా తరాల్లో వివాదాలు పెరిగేవి. తహశీల్దార్ (Tahsildar) కార్యాలయాల్లో మ్యుటేషన్ (Mutation) ప్రక్రియలో కూడా ఎన్నో ఆటంకాలు ఎదురయ్యేవి. ప్రభుత్వ అంచనాల ప్రకారం ఇలాంటి కారణాల వల్ల రాష్ట్రవ్యాప్తంగా సుమారు 55 వేల భూ సమస్యలు పెండింగులో ఉన్నట్లు గుర్తించారు.
ఈ నేపథ్యాన్ని గమనించిన ప్రభుత్వం, రిజిస్ట్రేషన్ ప్రక్రియ రైతులకు భారంగా మారకుండా ప్రత్యేక రాయితీ ఇవ్వాలని నిర్ణయించింది. కొత్త విధానం ప్రకారం వారసత్వంగా వస్తున్న వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ కోసం ఆస్తి విలువ రూ.10 లక్షలకు లోపులో ఉంటే కేవలం రూ.100 మాత్రమే స్టాంపు డ్యూటీగా చెల్లిస్తే సరిపోతుంది. ఆస్తి విలువ దీనికంటే ఎక్కువ అయితే రూ.1000 ఫీజు నిర్ణయించారు. ఈ రాయితీ పూర్తిగా యజమాని మరణం తర్వాత వారసులకు సంక్రమించే భూములకే వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ముందుగా ఈ రకమైన రిజిస్ట్రేషన్లకు ఆస్తి మార్కెట్ ధరలో ఒక శాతం డ్యూటీ విధించడంతో అనేక కుటుంబాలు రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి ముందుకు రాలేకపోయాయి.
చాలా మంది వారసులు తల్లిదండ్రుల మరణం తర్వాత ఒక రాత పత్రంపై భాగస్వామ్యం చేసుకుని, అదనంగా తహశీల్దార్కి మ్యుటేషన్ కోసం అప్లై చేసుకునేవారు. అయితే, రిజిస్ట్రేషన్ లేకపోవడంతో అధికారులకు భూముల వివరాలు నిర్ధారించడం కష్టం అయ్యేది. పాత రికార్డుల్లో లోపాలు, భూములపై హక్కుల విషయంలో అనుమానాలు, పుడుతున్న వివాదాలు.. ఇలా ఇవి రైతుల జీవనంలో ఇబ్బందులను సృష్టించేవి.
ఈ సమస్యలను శాశ్వతంగా తగ్గించేందుకు ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం ఎంతో ప్రయోజనకరంగా మారనుంది. యజమాని వీలునామా (Will) రాయకుండా మరణించినా, వారసులు పరస్పరం అంగీకారంతో భాగాలు పంచుకుంటే, ఇప్పుడు సబ్ రిజిస్ట్రార్ (Sub-Registrar) కార్యాలయంలో నామమాత్రపు ఫీజుతో రిజిస్ట్రేషన్ చేసుకునే వీలుంది.
ఈ చర్య రైతులకు ఆర్థిక భారాన్ని తగ్గించడమే కాకుండా, భవిష్యత్లో భూవివాదాలను నివారించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో భూములపై హక్కుల విషయంలో స్పష్టత వస్తూ, ప్రభుత్వ రికార్డులు సవ్యంగా నిల్వవుతాయి. మొత్తంగా ఈ నిర్ణయం ప్రజా సంక్షేమ దృష్ట్యా ఎంతో సానుకూల అడుగుగా భావించబడుతోంది.






