YS Jagan: వై.ఎస్.అంటే ప్రాణం.. జగన్ అంటే కోపం..! ఎందుకిలా..?
రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రువులు ఉండరు.. ఉన్నదల్లా శాశ్వత ప్రయోజనాలు మాత్రమే. ఈ నానుడికి ప్రస్తుతం తెలంగాణ రాజకీయ ముఖచిత్రం అద్దం పడుతోంది. ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి (YS Rajasekhar Reddy) కుడిభుజం, ఎడమభుజంలా వ్యవహరించిన నేతలు.. ఇప్పుడు ఆయన కుమారుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి (YS Jagan) దూరంగా జరగడమే కాకుండా, వైఎస్ బద్ధశత్రువుగా భావించిన చంద్రబాబు నాయుడిని (Chandrababu) ఆకాశానికెత్తేస్తున్నారు. తెలంగాణ మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkat Reddy), కొండా సురేఖల (Konda Surekha) తాజా వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రాజకీయ చర్చకు దారితీశాయి.
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కొండా సురేఖ.. వీరిద్దరూ వైఎస్సార్ హయాంలో ఆయనకు అత్యంత విధేయులు. వైఎస్ మాటకు ఎదురుచెప్పని నైజం వీరిది. వైఎస్ మరణానంతరం కొండా సురేఖ దంపతులు చేసిన త్యాగం అంతా ఇంతా కాదు. వైఎస్ జగన్ ‘ఓదార్పు యాత్ర’ కోసం మంత్రి పదవిని తృణప్రాయంగా వదిలేశారు. ముఖ్యంగా వరంగల్ జిల్లాలో జగన్ పర్యటనను అప్పటి టీఆర్ఎస్ అడ్డుకోవాలని చూసినప్పుడు, రాళ్ల దాడులను సైతం లెక్కచేయకుండా జగన్‌కు కవచంలా నిలబడ్డారు కొండా దంపతులు. అటు కోమటిరెడ్డి కూడా కాంగ్రెస్‌లో ఉంటూనే జగన్ పట్ల సానుభూతితో ఉండేవారు. చంద్రబాబు విధానాలను, ఆయన విజన్‌ను వైఎస్ ఉన్నప్పుడు వీరిద్దరూ తీవ్రంగా వ్యతిరేకించేవారు. బాబును ఒక ‘హైటెక్ కార్పొరేట్ నేత’గా విమర్శించేవారు.
కానీ, కాలం గిర్రున తిరిగింది. నాటి వైఎస్ విధేయులు నేడు చంద్రబాబు పాలనా దక్షతకు జై కొడుతున్నారు. తాజాగా తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అమరావతి వెళ్లి చంద్రబాబును కలవడం, ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’కు ఆహ్వానించడం రాజకీయ మర్యాదగానే కనిపించినా.. బయటకు వచ్చాక ఆయన చేసిన వ్యాఖ్యలు మాత్రం సంచలనం సృష్టించాయి. “చంద్రబాబు విజన్ సూపర్.. ఒకప్పుడు నేను ఆయన్ని విమర్శించాను, కానీ ఆయనే కరెక్ట్ అని ఇప్పుడు అర్థమవుతోంది. సైబరాబాద్‌ను సృష్టించి మాకు ఆదాయాన్ని సమకూర్చి పెట్టారు,” అని కోమటిరెడ్డి బహిరంగంగానే అంగీకరించారు. ఇది కేవలం పొగడ్త కాదు, ఒక సీనియర్ నేత తన గతం తప్పు అని ఒప్పుకోవడం. అటు కొండా సురేఖ కూడా గతంలో చంద్రబాబు అరెస్టు సమయంలో ఆయనకు మద్దతుగా మాట్లాడటం, జగన్ తీరును తప్పుబట్టడం తెలిసిందే.
వైఎస్సార్‌ను గురువుగా భావించే వీరు, ఆయన కుమారుడిని మాత్రం ఎందుకు విమర్శిస్తున్నారనేది ఇక్కడ ఆసక్తికరం. జగన్ మోహన్ రెడ్డి తన తండ్రి వైఎస్సార్‌లా కలుపుగోలుతనాన్ని ప్రదర్శించలేకపోతున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ, అధికారంలో ఉన్నప్పుడు కానీ జగన్ ఎవరి సలహాలు స్వీకరించరని, కేవలం తన నిర్ణయాలనే రుద్దుతారని కొండా సురేఖ గతంలోనే ఆరోపించారు. వైసీపీ నుంచి బయటకు వచ్చాక ఆమె చేసిన తీవ్ర విమర్శలు దీనికి నిదర్శనం. తాజాగా కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలు జగన్ ప్రస్తుత రాజకీయ వైఖరిని ఎండగట్టాయి. “ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా అనడం సరికాదు. ప్రజలు ఓడించినప్పుడు, వారి తరఫున పోరాడాలి తప్ప.. హోదాల కోసం పాకులాడకూడదు,” అని కోమటిరెడ్డి హితవు పలికారు. చంద్రబాబు గతంలో 23 సీట్లతోనే అసెంబ్లీలో పోరాడారని, జగన్ మాత్రం 11 సీట్లు వచ్చాయని అసెంబ్లీని బహిష్కరించడం పారిపోవడమే అవుతుందని వీరి విశ్లేషణ.
ఇది కేవలం వ్యక్తిగత విమర్శలు కాదు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. రేవంత్ రెడ్డికి చంద్రబాబుతో మంచి సాన్నిహిత్యం ఉంది. పాలనాపరంగా ఏపీ, తెలంగాణ కలిసి నడవాల్సిన అవసరం ఉంది. ఈ క్రమంలో చంద్రబాబు అనుభవాన్ని, విజన్‌ను ఉపయోగించుకోవాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది. వైఎస్సార్ ఆత్మలుగా పిలవబడే కోమటిరెడ్డి, సురేఖ వంటి వారు కూడా.. ‘రాజకీయ వైరం వేరు, అభివృద్ధి వేరు’ అనే పరిపక్వతకు వచ్చారని అర్థమవుతోంది. అదే సమయంలో, వైఎస్సార్‌కు ఉన్నట్లుగా.. జగన్‌కు ఇతర పార్టీల్లో మిత్రులు లేకపోవడం ఆయన స్వయంకృతాపరాధమేనని విశ్లేషకులు అంటున్నారు. తండ్రి స్నేహితులను, విధేయులను జగన్ దూరం చేసుకున్నారని, అందుకే క్లిష్ట సమయంలో ఆయనకు సలహా ఇచ్చే వారు కూడా కరువయ్యారని ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.
మొత్తానికి, వైఎస్సార్‌ను అమితంగా ప్రేమించే వారు కూడా.. ఇప్పుడు పాలన విషయంలో చంద్రబాబును ఆదర్శంగా తీసుకుంటుండటం, జగన్‌ను విమర్శిస్తుండటం ఏపీ రాజకీయాల్లోనే కాకుండా, జగన్ ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అంశంగా మారింది. తండ్రి పేరు చెప్పుకుని రాజకీయాలు చేయడం వేరు, తండ్రి సంపాదించిన అభిమానాన్ని నిలబెట్టుకోవడం వేరు అని ఈ పరిణామాలు తేల్చిచెప్తున్నాయి.






