Ramoji Excellence Awards: ఘనంగా రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డుల వేడుక
హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో రామోజీ గ్రూప్ సంస్థల వ్యవస్థాపకులు రామోజీరావు పేరిట ఏర్పాటు చేసిన ‘రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డు’(Ramoji Excellence Awards) ల ప్రదానం వైభవంగా జరిగింది. పాత్రికేయం, గ్రామీణాభివృద్ధి, సామాజికసేవ, సైన్స్ అండ్ టెక్నాలజీ, కళలు-సంస్కృతి, మహిళా సాధికారత, యూత్ ఐకాన్ విభాగాల్లో సేవలందించిన వ్యక్తులకు ఈ పురస్కారాలను అందజేశారు. పురస్కార గ్రహీతలకు జ్ఞాపిక, ప్రశంసాపత్రంతోపాటు రూ.10లక్షల చొప్పున నగదు అందజేశారు. దేశవ్యాప్తంగా ఆయా రంగాల్లో ప్రతిభ కనబరిచిన సుమారు 900 మంది కృషిని పరిశీలించి వారిలో నుంచి ఏడుగురిని ఎంపిక చేశారు.
భారత ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా హాజరైన ఈ కార్యక్రమంలో గౌరవ అతిథులుగా తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు రేవంత్‌రెడ్డి, చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, రామ్మోహన్నాయుడు, మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్, సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ప్రధాని మోదీ లిఖితపూర్వక సందేశాన్ని పంపించారు. సమాజసేవ, వృత్తి నైపుణ్యాన్ని గుర్తించాలనే రామోజీరావు సంకల్పాన్ని కొనసాగించేలా అవార్డుల ప్రదానాన్ని ఏటా కొనసాగిస్తామని రామోజీ గ్రూపు సంస్థల సీఎండీ సీహెచ్ కిరణ్ ఈ సందర్భంగా ప్రకటించారు.
రామోజీరావు 89వ జయంతి సందర్భంగా పురస్కారాలు అందుకొన్న వారిలో అమలా రూయియా (గ్రామీణాభివృద్ధి విభాగం), శ్రీకాంత్ బొల్లా (యూత్ ఐకాన్), గాలి మాధవీలత (సైన్స్ అండ్ టెక్నాలజీ), ఆకాశ్ టాండన్ (మానవసేవ), సాతుపాటి ప్రసన్న శ్రీ (కళ- సంస్కృతి), జైదీప్ హార్దికర్ (జర్నలిజం), పల్లవి ఘోష్ (మహిళా సాధికారత) ఉన్నారు. ఈ సందర్భంగా రామోజీ ఫౌండేషన్ రూపొందించిన రామోజీ ఇంగ్లిష్-తెలుగు, తెలుగు-తెలుగు నిఘంటువులను మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మాజీ సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ ఆవిష్కరించారు. రామోజీరావు జీవిత ఘట్టాలకు సంబంధించి కృత్రిమ మేధ ఆధారంగా రూపొందించిన వీడియోను ప్రదర్శించారు. ముందుగా వేదికపై నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అహ్లాదంగా, వినోదభరితంగా సాగాయి. రామోజీరావు కృషిని చాటుతూ కీరవాణి బృందం ఆలపించిన ప్రత్యేక గీతం, పలు రాష్ట్రాల సంస్కృతిని చాటేలా ప్రదర్శించిన నృత్య రూపకం ఆకట్టుకున్నాయి.
అవార్డుగ్రహీతల సేవలు…
చెరువులు, చెక్‌డ్యామ్‌ల నిర్మాణం చేపట్టి జలసంరక్షణతో 18 లక్షల మంది గ్రామీణ ప్రజల జీవితాలను మార్చిన అమ్లా అశోక్ రుయాకు గ్రామీణాభివృద్ధి విభాగంలో అవార్డు దక్కింది. వైకల్యాన్ని అధిగమించి పారిశ్రామికవేత్తగా రాణిస్తున్న శ్రీకాంత్ బొల్లాకు యూత్ ఐకాన్‌గా, ప్రపంచంలోనే ఎత్తైన కశ్మీర్‌లోని చినాబ్ వంతెనను డిజైన్ చేసిన బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ ప్రొఫెసర్ మాధవీలతకు సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో పురస్కారాలు అందజేశారు. కాగా, మురికివాడల్లో పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించి.. వారి జీవితాల్లో మార్పు తెచ్చిన ఆకాశ్ టాండన్‌కు మానవతా సేవల విభాగంలో, కళలు-సంస్కృతి విభాగంలో సత్తుపతి ప్రసన్నకు, జర్నలిజంలో కృషికిగాను జైదీప్ హర్దేకర్కు, మహిళా సాధికారత కోసం పాటుపడిన పల్లబీ ఘోష్‌కు అవార్డులను ప్రదానం చేశారు.






