Revanth Reddy: మంత్రుల్ని తొలగిస్తేనే ప్రభుత్వంపై పట్టు ఉన్నట్లా: సీఎం రేవంత్

తనకు పరిపాలనపై పట్టు లేదని కొంతమంది ఆరోపిస్తున్నారని, కానీ మంత్రులను తొలగిస్తేనో లేదంటే అధికారులను బదిలీ చేస్తేనో పాలనపై పట్టు సాధించినట్లు కాదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) చెప్పారు. “ఎలాంటి ఆరోపణలు లేకుండా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నాం. ప్రభుత్వ పథకాల్లో పారదర్శకతను నిర్ధారిస్తున్నాం. అసలైన అర్హులకు పథకాలు తప్పకుండా వర్తింపజేయాలని మా ఎమ్మెల్యేలకు, అధికారులకు స్పష్టంగా సూచిస్తున్నాం,” అని రేవంత్ తెలిపారు.
అసెంబ్లీ ఆవరణలో రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. “ప్రభుత్వం ఏర్పడిన తొలి ఏడాదిలోనే 54 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశాం. మొదటి ఏడాదిలో ఇంత భారీ సంఖ్యలో ఉద్యోగాలు అందించిన రాష్ట్రం మరొకటి లేదు,” అని సీఎం రేవంత్ (CM Revanth Reddy) వెల్లడించారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న వివిధ పథకాల ద్వారా లక్షలాది కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయన్నారు. స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉన్న 65 లక్షల మంది మహిళలకు త్వరలో నాణ్యమైన చీరలను పంపిణీ చేస్తామని ప్రకటించారు. స్వాతంత్ర్యం తర్వాత ఇప్పటి వరకు కులగణన జరగలేదని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తెలిపారు. “సమాజానికి ఎక్స్-రే వంటి కులగణన దేశమంతా జరగాలని రాహుల్ గాంధీ సూచించారు. ఎస్సీ వర్గీకరణ కోసం మూడున్నర దశాబ్దాలుగా ఉద్యమం జరుగుతోంది. మేము అబద్ధాల పునాదుల మీద ప్రభుత్వాన్ని నడపడం లేదు,” అని ప్రతిపక్షాలను ఎద్దేవా చేశారు.