Raghunandanrao: పాలమూరుకు రేవంత్ ఏం చేశారో చెప్పాలి : రఘనందన్ రావు
తెలంగాణలో ఏం సాధించారని పార్టీ పేరు మార్చుకుని దేశమంతా తిరిగారని శాసనమండలి వేదికగా ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అడిగిన ప్రశ్నలకు ఎవరు సమాధానం చెబుతారని మెదక్ ఎంపీ రఘనందన్ రావు (Raghunandanrao) అన్నారు.సిద్దిపేట జిల్లా వర్గల్ కేంద్రంలో జవహర్ నవోదయ విద్యాలయంలో నిర్వహించిన 27వ జాతీయ స్థాయి యువ పార్లమెంట్ పోటీల్లో ఆయన మాట్లాడారు. కేటీఆర్ చెప్తాడా? హరీశ్‌రావు చెప్తాడా? లేక ఫామ్ హౌస్‌లో ఉన్న పెద్దాయన కేసీఆర్ (KCR) చెప్తాడా అని ఆయన ఎద్దేవా చేశారు. తెలంగాణలో సొంత రైతులు చనిపోతే పట్టించుకోని కేసీఆర్ ప్రభుత్వం, పంజాబ్, కర్ణాటక, మహారాష్ట్ర రైతులకు ఇక్కడి నిధులు ఎలా పంపిణీ చేసిందని నిలదీశారు. ఇప్పుడు ఇదే విషయాన్ని స్వయంగా కేసీఆర్ బిడ్డే అడుగుతున్నారని, దీనికి ఆ పార్టీ నేతలు ఏం సమాధానం చెబుతారని ఆయన ఎద్దేవా చేశారు. శాసనసభలో నేడు నాయకులు వాడుతున్న భాషపై రఘునందన్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, ప్రతిపక్ష నేతలు తమ భాషను నియంత్రించుకోవాలని ఆయన హితవు పలికారు. పాలమూరు ప్రాజెక్టు విషయంలో పదేళ్లలో కేసీఆర్ చేయనిది, రెండేళ్లలో రేవంత్‌రెడ్డి(Revanth Reddy) ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.






