Raghunandan Rao: రాహుల్ గాంధీ ప్రాతినిథ్యం రద్దు చేయాలని కోరతా: బీజేపీ ఎంపీ

దేశ రాజకీయాల్లో ఓటు చోరీ వివాదం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల కమిషన్ (ఈసీ) బీజేపీతో కలిసి ఓట్ల చోరీకి పాల్పడుతోందని లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఆరోపించగా, ఈ ఆరోపణలకు కట్టుబడి డిక్లరేషన్ ఇస్తారా అని ఈసీ సవాల్ విసిరింది. ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపీ రఘునందన్ రావు (Raghunandan Rao) చేసిన ఆరోపణలు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి. ఓటర్ లిస్టుపై తాము కూడా ఎంక్వైయిరీ చేశామని, ఇందులో రాహుల్ గాంధీ సొంత నియోజకవర్గం రాయ్‌బరేలీలోనే 2 లక్షల ఓట్ల అవకతవకలు జరిగాయని రఘునందన్ రావు ఆరోపించారు. ఈ అంశంపై రాహుల్ గాంధీ (Rahul Gandhi) ప్రాతినిథ్యం రద్దు చేయాలని ఈసీని కోరబోతున్నామని ఆయన తెలిపారు.
రఘునందన్ రావు (Raghunandan Rao) మాట్లాడుతూ.. ఓటు చోరీ వివాదం మొదలైన తర్వాత తమ కార్యకర్తలను డోర్ టు డోర్ పంపి సర్వే చేయించామని, ఇందులో రాయ్‌బరేలీ ఓటర్ లిస్టులో 71,977 ఫేక్ అడ్రస్‌లతో ఉన్న ఓట్లు, ఎన్నికలకు ముందు 92,747 మంది కొత్తగా చేరిన ఓటర్లు, 52 వేల ఫేక్ బర్త్ సర్టిఫికెట్లతో నమోదు చేసుకున్న ఓట్లు ఉన్నాయని చెప్పారు. ఇదే తరహాలో ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) ప్రాతినిథ్యం వహిస్తున్న వాయనాడ్, మమతా బెనర్జీ అల్లుడు అభిషేక్ బెనర్జీ ప్రాతినిథ్యం వహిస్తున్న డైమండ్ అర్బర్, అఖిలేశ్ యాదవ్, ఆయన సతీమణి డింపుల్ యాదవ్ ప్రాతినిథ్యం వహించిన నియోజకవర్గాల ఓటర్ల జాబితాలపై కూడా తమకు అనుమానాలు ఉన్నాయని రఘునందన్ రావు (Raghunandan Rao) పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలను ఆన్ రికార్డుగా, బీజేపీ ఎంపీగా తాను చేస్తున్నానని ఆయన సంచలనంగా చెప్పారు.