Ponnam Prabhakar: తెలంగాణలో జరిగే కులగణన రీసర్వే కాదు: మంత్రి పొన్నం ప్రభాకర్

తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 16 నుండి 28 వరకు జరగనున్న కులగణన రీసర్వే కాదని, ఇంతకుముందు చేసిన సర్వేలో పాలుపంచుకోని వారి కోసమే దీన్ని నిర్వహిస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) వివరించారు. గత సర్వేలో సర్వేలో చాలామంది ప్రజలు పాల్గొనలేదని, తమకు అడిగిన సమాచారం ఇవ్వలేదని ఆయన గుర్తు చేశారు. ఈ క్రమంలోనే ఈ గడువును ఫిబ్రవరి 28 వరకు పొడిగించినట్లు స్పష్టం చేశారు. అలాగే తెలంగాణలో చేపట్టిన కులగణన దేశంలోని అన్ని రాష్ట్రాలకు మార్గదర్శకంగా నిలుస్తుందని ఆయన (Ponnam Prabhakar) అభిప్రాయపడ్డారు. సర్వేలో పాల్గొనకుండా బీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందన్న ప్రభాకర్.. ప్రజాస్వామ్యంపై ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా బీఆర్ఎస్ అగ్రనేతలు కూడా ఈ సర్వేలో పాల్గొనాలని సూచించారు. బీజేపీపై కూడా తీవ్రమైన విమర్శలు చేసిన మంత్రి (Ponnam Prabhakar) .. బీజేపీ బడా వ్యాపారస్తుల పార్టీ అని దుయ్యబట్టారు. కుల గణన, బీసీ, ఎస్సీ వర్గీకరణ ఇలాంటివేమీ ఆ పార్టీకి ఇష్టం లేదని విమర్శించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణలో రిజర్వేషన్లు అమలు చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసిన ఆయన.. ఈ సర్వే పూర్తయిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని తెలియజేశారు.