Ponguleti Srinivasa Reddy: ఇందిరమ్మ ఇళ్లకే మా తొలి ప్రాధాన్యం: మంత్రి పొంగులేటి
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆశించినంతగా లేనప్పటికీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Minister Ponguleti Srinivasa Reddy) తెలిపారు. శనివారం నాడు సచివాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం కేంద్రం నుండి వచ్చే అరకొర సహాయంపై ఆధారపడటం లేదన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కో ఇంటికి రూ. 72 వేలు, పట్టణాల్లో రూ. 1.52 లక్షలు మాత్రమే కేంద్రం ఇస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఒక్కో ఇంటికి రూ. 5 లక్షలు అందిస్తోందని పేర్కొన్నారు. కేంద్రం విధించే అనేక నిబంధనలను పక్కనపెట్టి, రాష్ట్ర ప్రభుత్వం తన సొంత మార్గదర్శకాలతో పకడ్బందీగా లబ్ధిదారులను ఎంపిక చేస్తోందని వివరించారు. గత ప్రభుత్వం చేపట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం పనులు అసంపూర్తిగా ఉన్నాయని, వాటికి మరమ్మతులు చేసి త్వరలో లబ్ధిదారులకు కేటాయిస్తామని అన్నారు. భూ భారతి పథకం కింద వచ్చిన సాదాబైనామా దరఖాస్తులు హైకోర్టు పరిధిలో ఉన్నాయని, కోర్టు తీర్పు రాగానే వాటిని పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నామని మంత్రి పొంగులేటి (Minister Ponguleti Srinivasa Reddy) స్పష్టం చేశారు.







