Minister Ponguleti : ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా ముందస్తు చర్యలు : మంత్రి పొంగులేటి

వర్షాల వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) అన్నారు. తెలంగాణలో భారీ వర్షాలు సహాయక చర్యలపై మంత్రి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ (Video conference) నిర్వహించారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ సహాయ చర్యల కోసం ప్రతి జిల్లాకు రూ.కోటి విడుదల చేస్తున్నట్లు తెలిపారు. సెలవులో ఉన్న అధికారులు, సిబ్బందిని వెనక్కి పిలిపించాలని కోరారు. వర్షాలపై అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. వచ్చే 3 రోజుల్లో భారీ వర్షాల దృష్ట్యా జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు. వివిధ జిల్లాల్లోని పరిస్థితి గురించి కలెక్టర్లను మంత్రి పొంగులేటి అడిగి తెలుసుకున్నారు. లోతట్టు ప్రాంతాల్లో చేపట్టాల్సిన రక్షణ చర్యలపై ఆదేశాలు జారీ చేశారు. జీహెచ్‌ఎంసీ (GHMC) మున్సిపల్, ట్రాఫిక్ (Traffic) విభాగాలు, మెట్రో వాటర్ బోర్డు (Metro Water Board) సమన్వయంతో పని చేయాలన్నారు. ఈ సమీక్షలో సీఎస్ రామకృష్ణారావు పాల్గొన్నారు.