హైదరాబాద్ లో రియల్టీ జోరు

అందరికీ అందుబాటు ధరల్లో గృహల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలతో రియల్టీ రంగం వృద్ధి రేటు మరింత జోరందుకుంటుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ సంస్థ ఏర్పాటుతో ప్రాజెక్టులు ఆలస్యం చేసే బిల్డర్లకూ తెర పడుతుందని అంచనా. ఈ బిల్లుతో బిల్డర్లు కొత్త ప్రాజెక్టులు పక్కన పెట్టి ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేయడంపై దృష్టి పెట్టిన విషయాన్ని పరిశ్రమ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. వడ్డీ రేట్లు కూడా మరింత తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఢిల్లీ వంటి నగరాల్లో ఇంకా సమస్యలున్నా, హైదరాబాద్ వంటి నగరాల్లో పరిశ్రమ వేగంగా కోలుకుంటోందని అంతర్జాతీయ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ సిబిఆర్‌ఇ సౌత ఏషియా ప్రైవేట్ లిమిటెడ్ హెడ్ (రెసిడెన్షియల్ సర్వీసెస్) ఎఎ్‌స శివరామకృష్ణన్ చెప్పారు. మరో రెండు మూడేళ్ల వరకు హైదరాబాద్ మార్కెట్‌లో వృద్ధి రేటుకు ఢోకా ఉండకపోవచ్చన్నారు. నివాస గృహాలతో పోలిస్తే హైదరాబాద్‌లో వాణిజ్య నివాసాలకు డిమాండ్ ఎక్కువగా ఉంది. 2015లో నగరంలో 35 లక్షల చదరపు అడుగుల వాణిజ్య నివాసాలకు డిమాండ్ ఉంటే, 2016లో ఇది 66 లక్షల చదరపు అడుగులకు పెరిగింది. ఇప్పటికీ చెన్నై, బెంగుళూరు నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లో ధరలు తక్కువగా ఉండడం కూడా బిల్డర్లకు కలిసి వస్తోంది. హైదరాబాద్ కాస్మోపాలిటన్ కల్చర్‌తోపాటు, మౌలిక సదుపాయాలు కూడా ఇందుకు దోహదం చేస్తున్నాయి. చెన్నై, బెంగళూరుల్లోని ప్రధాన ప్రాంతాలతో పోలిస్తే హైదరాబాద్‌లోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో నివాస భవనాల రేట్లు ఇప్పటికీ చౌకగా ఉన్నాయి.