Pilot Rohith Reddy: బీఆర్ఎస్ వీడే ప్రసక్తే లేదు.. ఆ వార్తలు అబద్ధం: పైలట్ రోహిత్‌రెడ్డి

సోషల్ మీడియా, టీవీ ఛానల్స్‌లో తనపై వస్తున్న వదంతులను మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి (Pilot Rohith Reddy) ఖండించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను పక్కదారి పట్టించేందుకే ఇలాంటి పుకార్లు సృష్టిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. బీఆర్ఎస్ను వీడే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తూ, పార్టీ సభ్యులు ఈ పుకార్లను నమ్మవద్దని కోరారు. తానే గువ్వల బాలరాజును పంపానని, మరికొందరు ఎమ్మెల్యేలను కూడా పంపిస్తానని వస్తున్న వార్తలు అవాస్తవాలని ఆయన (Pilot Rohith Reddy) కొట్టిపారేశారు. గతంలో తనకు ఎన్నో ఉన్నత పదవులు, వేల కోట్ల రూపాయల కాంట్రాక్టులు ఆశ చూపినా, ప్రజల కోసం తాను పార్టీ మారలేదని తెలిపారు. కేసీఆర్ (KCR) నాయకత్వంలోనే తెలంగాణ అన్ని రంగాల్లో ముందుకు సాగుతుందని రోహిత్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర అభివృద్ధిని ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిపిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని కొనియాడారు. తన తుదిశ్వాస వరకు తాండూరు ప్రజలకు సేవ చేస్తానని, కేసీఆర్, కేటీఆర్‌లకు సైనికుడిగా పనిచేస్తానని ఆయన చెప్పారు. లోకల్ బాడీ ఎన్నికల్లో బీఆర్ఎస్ జెండా ఎగురుతుందని ఆయన (Pilot Rohith Reddy) ధీమా వ్యక్తం చేశారు.