తెలంగాణకు భారీ పెట్టుబడులు… మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు

లైఫ్ సైన్సెస్, ఫార్మా రంగాల్లో తెలంగాణకు భారీ పెట్టుబడులు.. రాష్ట్ర ఐటీశాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీదర్‌బాబు
తెలంగాణ రాష్ట్రంలో లైఫ్ సైన్సెస్, ఫార్మా రంగాల్లో భారీ పెట్టుబడులను ఆకర్షించామని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. హైటెక్ సిటీలోని హెచ్‌ఐసీసీలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ 141 కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్నామని, రూ.35,820 కోట్ల పెట్టుబడులకు రానున్నాయని చెప్పారు. దేశీయ, బహుళ జాతి కంపెనీలు ఔషధ, టీకా, లైఫ్ సైన్సెస్, పరిశోధన రంగాల్లో నిర్మాణాలు ప్రారంభించాయన్నారు. ఈ కంపెనీలతో ప్రత్యక్షంగా 51,086 మందికి, మరో లక్షన్నర మందికి పరోక్ష ఉపాధి లభిస్తుందని వెల్లడిరచారు. వచ్చే రెండు నెలల్లోనే లైఫ్ సైన్సెస్ కంపెలు నెలకొల్పేందుకు ముందుకొచ్చే సంస్థలకు భూ కేటాయింపులు, ప్రోత్సాహకాలను సంబంధించిన విధాన ప్రకటనను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేయనునట్లు వెల్లడించారు.
తెలంగాణ రాష్ట్రంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రీజినల్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని మంత్రి కేంద్రాన్ని కోరారు. హైటెక్ సిటీలో తమిళనాడు ఐటీ మంత్రి పళనివేల్ తియాగరాజన్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో స్కిల్ యూనివర్సిటీకి ఏర్పాటు చేస్తున్నందుకు ఎక్స్ లెన్స్ సెంటర్ వల్ల యువతకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు. ముంబై తరహాలో రాష్ట్రానికి కూడా ఒక కేంద్రాన్ని కేటాయించాలని కోరారు. వచ్చే ఏడాది మొదటి త్రైమాసికంలో గేమింగ్ పాలసీని విడుదల చేయనున్నట్లు తెలిపారు.
ఫార్మా క్లస్టర్ భూ సేకరణలో ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తుందని మంత్రి తెలిపారు. ప్రజల అంగీకరించిన తర్వాతే పనులు చేపడతామని స్పష్టం చేశారు. ప్రతిపక్షాల కుట్రలకు, రెచ్చగొట్టే చర్యలకు ప్రభుత్వం భయపడదని స్పష్టం చేశారు. లగచర్ల ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నామని, అభివృద్ధి అడ్డుకునే చర్యలను ఉపేక్షించబోమని శ్రీధర్ బాబు తెలిపారు.