Jagan: జగన్ పాదయాత్ర చుట్టూ పెరుగుతున్న అనుమానాలు.. అసలు నిజం ఏమిటో?
వైసీపీ (YCP) అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) మరోసారి పాదయాత్రకు సిద్ధమవుతున్నారన్న వార్తలు ఇటీవల రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. 2019 ఎన్నికలకు ముందు ఆయన 3,000 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేసి పెద్ద ఎత్తున ప్రజలను కలిసిన సంగతి తెలిసిందే. ఆ ప్రయాణంలో ఇచ్చిన హామీలతోనే అధికారంలోకి వచ్చారని కూడా వైసీపీ నాయకులు చెబుతుంటారు. ఇప్పుడు కూడా అదే తరహాలో మళ్లీ ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తారని కొందరు భావిస్తున్నారు. అయితే పార్టీలో జరుగుతున్న అంతర్గత చర్చలు మాత్రం మరో కోణాన్ని బయటపెడుతున్నాయి.
జగన్ ఇంత పెద్ద పాదయాత్ర చేయడం ఈసారి సాధ్యం కాకపోవచ్చని కొంతమంది వైసీపీ ముఖ్య నాయకులు అభిప్రాయపడుతున్నారు. దీనికి ప్రధాన కారణంగా ఆయన ఆరోగ్య పరిస్థితినే చూపిస్తున్నారు. గత పాదయాత్ర సమయంలోనే ఆయన ఆరోగ్యం పూర్తిగా సహకరించలేదని అప్పటి సంఘటనలను వారు గుర్తుచేస్తున్నారు. అప్పట్లో కూడా ఆయనకు రెండు రోజుల పాటు విరామం అవసరమైన సందర్భాలు వచ్చాయి. ఆ సమయంలో డాక్టర్ గురుమూర్తి (Tirupati MP) ,డాక్టర్ ఐవి రావు వంటి వైద్యులు ఆయనకు చికిత్స అందించారు.
పాదయాత్ర సమయంలో కండరాలకు ఒత్తిడి పెరగడం, సుదీర్ఘ నడక వల్ల అలసట చేరడం వంటి సమస్యలు ఆయనకు తలెత్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మళ్లీ అంతదూరం నడవడం జగన్కు సాధ్యమా అన్న ప్రశ్న వైసీపీలోనూ వినిపిస్తోంది. ముఖ్యంగా ఆయన అధికారంలో ఉన్నప్పుడు జరిగిన కొన్ని సంఘటనలను నేతలు చర్చిస్తున్నారు. ఒక శంకుస్థాపన కార్యక్రమంలో వంగి కొబ్బరికాయ పగలగొట్టడంలో కూడా జగన్ ఇబ్బంది పడ్డారని, అందుకే నిలబడే ఆ కార్యక్రమాన్ని పూర్తి చేశారని గుర్తుచేస్తున్నారు. ఇదే విషయాన్ని ఉదాహరణగా చూపుతూ సుదీర్ఘ పాదయాత్ర ఆయన శరీరానికి భారమవుతుందని కొందరు సూచిస్తున్నారు.
ఇక మరోవైపు, జగన్ నిజంగానే పాదయాత్ర చేయాలనుకుంటున్నారా లేక ఇది కేవలం రాజకీయ ప్రచారంకోసమే వేలాదిస్తున్న వార్తా అనేది కూడా స్పష్టంగా తెలియట్లేదు. గుంటూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి (Lella Appi Reddy) మాట్లాడుతూ, పాదయాత్రపై ఏ నిర్ణయం తీసుకోలేదని, ప్రస్తుతం దానికి అవసరం కూడా లేదని తెలిపారు. దీనితో ఆరోగ్య పరిస్థితే కారణమా లేక రాజకీయ వ్యూహమా అన్న సందేహాలు ఎక్కువయ్యాయి. పార్టీలో అయితే ఈ అంశంపై స్పష్టమైన నిర్ణయం లేకపోవడం గమనించదగ్గ విషయం. ఇప్పటికైతే జగన్ పాదయాత్ర అనే విషయం ప్రచారస్థాయిలోనే ఉండిపోయింది. నిజంగా ఆయన మరోసారి విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లే యోచనలో ఉన్నారా, లేక ఇది కేవలం బాహ్య ఊహాగానమేనా అనేది వచ్చే రోజుల్లో తేలనుంది.






