Sudarshan Reddy: ప్రభుత్వ సలహాదారుగా పి.సుదర్శన్‌రెడ్డి
నిజామాబాద్ జిల్లా బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్‌రెడ్డి (Sudarshan Reddy)ని ప్రభుత్వ సలహాదారు (అభివృద్ధి, సంక్షేమ ఫ్లాగ్షిప్ పథకాల అమలు)గా నియమించింది. ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల ఎమ్మెల్యే కె.ప్రేమ్‌సాగర్‌రావు (K. Premsagar Rao) ను రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ చైర్మన్‌గా నియమించింది. ఇద్దరికీ క్యాబినెట్ హోదా కల్పించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు (K. Ramakrishna Rao) రెండు వేర్వేరు ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాదు, సుదర్శన్‌రెడ్డి క్యాబినెట్ హోదాలో అన్ని క్యాబినెట్ సమావేశాలకు ప్రత్యేక ఆహ్వానితుడిగా హాజరవుతారని ప్రభుత్వం తెలిపింది. ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై జిల్లా కలెక్టర్లు (District Collectors), ప్రభుత్వ శాఖల కార్యదర్శులు, ఇతర అధికారులతో సమీక్షించే అధికారాన్ని ఆయనకు దఖలు పరిచింది. మంత్రుల స్థాయిలో ఆయనకు నివాస భవనం, సచివాలయంలో మంత్రుల మాదిరిగా చాంబర్‌ను కూడా కేటాయించనున్నట్లు పేర్కొంది. జీత భత్యాలు, సిబ్బంది వంటి సౌకర్యాలు కూడా మంత్రుల స్థాయిలో ఉంటాయని తెలిపింది. ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక పథకాలను ప్రత్యేక ప్రధాన కార్యదర్శి/ముఖ్యకార్యదర్శి/కార్యదర్శి స్థాయి అధికారి పర్యవేక్షిస్తారని, సలహాదారు సుదర్శన్‌రెడ్డికి సచివాలయం నుంచి అవసరమైన సహకారం అందిస్తారని వివరించింది. సలహాదారు, కార్యదర్శి యూనిట్ మొత్తం, పథకాల అమలుపై ఎప్పటికప్పుడు క్యాబినెట్‌కు వివరించాల్సి ఉంటుందని పేర్కొంది.







