NIT: నిట్ విద్యార్థికి రూ.1.27 కోట్ల ప్యాకేజీ!
వరంగల్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ) ప్లేస్‌మెంట్స్‌లో దూసుకుపోతోంది. 2025-26 ప్లేస్మెంట్ సీజన్ ప్రారంభ దశలోనే రికార్డు స్థాయిలో అద్భుత ఫలితాలను సాధించింది. ప్లేస్మెంట్ సీజన్ ప్రారంభమైన కేవలం రెండు నెలల వ్యవధిలోనే 528 మంది విద్యార్థులు మంచి ప్యాకేజీలతో ప్లేస్మెంట్లు పొందారు. వరంగల్ (Warangal) ఎన్ఐటీ చరిత్రలో మొదటిసారిగా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన బీటెక్ విద్యార్ధి నారాయణ త్యాగి (Narayana Tyagi) (నోయిడా, ఉత్తరప్రదేశ్) బహుళజాతి కంపెనీ నుంచి రూ.1.27 కోట్ల సీటీసీ (కాస్ట్ టూ కంపెనీ)తో దేశీయ ఆఫర్‌ను పొందారు. ఎలక్ట్రికల్ అండ్ ఎలకా్ట్రనిక్స్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన మరో విద్యార్థి మహమ్మద్ నహిల్ నష్వాన్ (Mohammed Nahil Nashwan) (ఖమ్మం) రూ.1 కోటి సీటీసీ తో దేశీయ ఆఫర్‌ను పొందారు. 2025-26 ప్లేస్మెంట్ డ్రైవ్ ప్రారంభమైన రెండు నెలల వ్యవధిలోనే రూ.70లక్షలకుపైగా సీటీసీతో ఆరుగురు, రూ.50లక్షలకుపైగా సీటీసీతో 34మంది, రూ.30 లక్షలకుపైగా సీటీసీతో 125మంది, రూ. 25 లక్షలకుపై సీటీసీతో 200మంది విద్యార్థులు ఆఫర్లు పొందారు. గత నెల 15 వరకు సగటు ప్యాకేజీ రూ.26 లక్షలను దాటింది. ప్లేస్మెంట్ సీజన్ కొనసాగుతూనే ఉంది. ఎన్ఐటీ డైరెక్టర్ ప్రొ. బిద్యాధర్ సుబుధి ప్లేస్మెంట్ పొందిన విద్యార్థులకు అభినందనలు తెలిపారు.







