35 వసంతాలు పూర్తి చేసుకున్న మైహోమ్.. టార్గెట్ వెల్లడించిన రామేశ్వరరావు జూపల్లి

హైదరాబాద్: ప్రముఖ నిర్మాణ సంస్థ మైహోమ్ కన్‌స్ట్రక్షన్స్ ఈ ఏడాదితో 35 వసంతాలు పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా మైహోమ్ గ్రూప్ చైర్మన్ జూపల్లి రామేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. ఈ ఏడాది 8మిలియన్ చదరపు అడుగులు అంటే 80 లక్షల చదరపు అడుగుల నిర్మాణాలు పూర్తి చేయడమే తమ కంపెనీ లక్ష్యమని రామేశ్వరరావు తెలిపారు. ఇలా చేయడం ద్వారా తమ కంపెనీ 35 మిలియన్ చదరపు అడుగుల్లో నిర్మాణాలు పూర్తి చేసినట్లు అవుతుందని ఆయన చెప్పారు. కంపెనీ 35 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ 35 మిలియన్(3.5 కోట్ల) చదరపు అడుగుల మైలురాయిని చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. కోకాపేటలో తాము నిర్మిస్తున్న కమర్షియల్ ప్రాజెక్టు.. ఆసియా ఖండంలోనే అతి పెద్ద ఆఫీస్ స్పేస్ అని చెప్పారు. ఈ ప్రాజక్టులో 27 మిలియన్ చదరపు అడుగుల స్థలం కవర్ అవుతోందని, ఇక్కడ నిర్మాణాలన్నింటినీ ఎకో-ఫ్రెండ్లీ టెక్నాలజీతోనే చేపడుతున్నామని స్పష్టం చేశారు. తెల్లాపూర్‌లో తమ కంపెనీ చేపట్టిన తొలి విల్లా ప్రాజెక్టు మైహోమ్ అంకుర, ప్రీమియం లైఫ్ స్టైల్ అపార్ట్‌మెంట్స్ హైహోమ్ త్రిదశ ప్రాజెక్టులో విద్య, రిటైల్, ఎంటర్‌టైన్‌మెంట్ సదుపాయాలు కూడా అందుబాటులో ఉంటాయని వివరించారు. శంషాబాద్‌లో నిర్మిస్తున్న కంపెనీ డ్రీమ్ ప్రాజెక్టు కూడా వాతావరణ హిత సిటీగా ఉంటుందని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని వివిధ ప్రీమియం రియల్టీ ప్రాజెక్టుల్లో కంపెనీ ఈ ఏడాదిలో 2వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టనుందని తెలియజేశారు.
కొవిడ్ ప్రభావం..
రియల్టీ రంగంపై కొవిడ్19 ప్రభావం గురించి మైహోమ్ కన్‌స్ట్రక్షన్ ఎండీ జూపల్లి శ్యామ్ రావు స్పందించారు. కొవిడ్ ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు తాము డిజిటల్ విధానాన్ని ఎంచుకున్నట్లు ఆయన చెప్పారు. ప్రాపర్టీ కొనుగోలు చేయాలనుకునే వారికి వర్చువల్‌గా భవనాలను చూపించే 3డీ హోం విజువలైజేషన్‌తోపాటు ఆన్‌లైన్‌లో ప్రాపర్టీలు కొనుగోలు చేసేలా సదుపాయాలు కల్పించినట్లు తెలిపారు. తెల్లాపూర్‌లో చేపట్టిన త్రిదశ ప్రాజెక్టుల విషయంలో ఇప్పటికే ఈ ఆన్‌లైన్ సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని తెలియజేశారు. మిగతా ప్రాజెక్టుల్లో కూడా త్వరలోనే ఈ సదుపాయాలు అందుబాటులోకి తెస్తామని చెప్పారు.