హైదరాబాద్‌లో మాడల్ ఎన్ ఇన్నోవేషన్ సెంటర్
అమెరికాకు చెందిన టెక్నాలజీ సేవల సంస్థ మాడల్ ఎన్ హైదరాబాద్‌లో నూతన ఇన్నోవేషన్ సెంటర్‌ను ప్రారంభించింది. ఈ సెంటర్‌ను తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జయేశ్ రంజన్ మాట్లాడుతూ ప్రపంచ ఐటీ రంగంలో అత్యధిక వృద్ధిని నమోదు చేసుకుంటున్న మోడల్ ఎన్‌కు స్వాగతం పలుకుతున్నట్లు తెలిపారు. అంతర్జాతీయ టెక్నాలజీ కంపెనీలకు అడ్డాగా హైదరాబాద్‌లో ఐటీ రంగంలో పుష్కలమైన అవకాశాలున్నాయని, ముఖ్యంగా స్టార్టప్‌లు, వెంచర్ క్యాపిటలిస్ట్‌లు అత్యధికంగా ఇక్కడే ఉన్నట్లు తెలిపారు. కంపెనీకి ఉన్న కస్టమర్లలో 70 శాతం సాస్ ప్లాట్‌ఫాం పరిధికి చెందినవారు కావడం విశేషం. ప్రస్తుతం సంస్థ ప్రపంచవ్యాప్తంగా 120 దేశాల్లో ఫార్మాస్యూటికల్ మెడికల్ టెక్నాలజీ, సెమికండక్టర్, టెక్నాలజీ విభాగాల్లో సేవలు అందిస్తున్నది. 70 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ సెంటర్లో 500 మంది సిబ్బంది కూర్చోవడానికి వీలుంటుంది.






