Revanth Reddy: సినీ డైరెక్టర్ కు ఎమ్మెల్సీ, రేవంత్ కీలక నిర్ణయం

తెలంగాణ(Telangana)లో రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాలను ఆకట్టుకునేందుకు తీవ్రంగా కష్టపడుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలనపై ఇంకా పట్టు పెంచుకోలేదు అనే అభిప్రాయాలకు తెరతీస్తూ, త్వరలోనే కీలక నిర్ణయాలు తీసుకునేందుకు సీఎం అడుగులు వేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా రేవంత్ రెడ్డికి పూర్తిస్థాయిలో సహకారం అందిస్తున్న నేపథ్యంలో ఆయన కూడా కొన్ని వర్గాలను ఆకట్టుకునేందుకు కాస్త దూకుడుగానే అడుగులు వేస్తున్నట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో త్వరలోనే కొన్ని సంక్షేమ కార్యక్రమాలకు కూడా ఆయన శ్రీకారం చుట్టే అవకాశం ఉంది అనే ప్రచారం సైతం జరుగుతుంది. ఇదే సమయంలో కేసీఆర్ మాదిరిగా కళాకారులను గుర్తించే దిశగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం అడుగులు వేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం సినిమా వాళ్లు కాంగ్రెస్ పార్టీకి కాస్త దూరంగానే కనపడుతున్నారు. అల్లు అర్జున్, పుష్ప సినిమా తర్వాత సినిమా వాళ్లకు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాస్త దూరం పెరిగింది. దీనితో గద్దర్ అవార్డుల పేరుతో సినిమా వాళ్ళను కాస్త దగ్గర చేసుకునే ప్రయత్నం సీఎం చేశారు.
ఇక ఇప్పుడు సినీ నటుడు, దర్శకుడు ఆర్ నారాయణ మూర్తికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడానికి రేవంత్ రెడ్డి రెడీ అయినట్లు సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించి ఆయన కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి సమాచారం పంపిన తర్వాత అధికారిక ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. ఆర్.నారాయణమూర్తి ఆంధ్రప్రదేశ్ కు చెందిన వ్యక్తి. అయితే తెలంగాణలో ఆయనకు మంచి ఇమేజ్ ఉంది. ఉద్యమ సమయంలో కూడా ఆయన తెలంగాణ తరఫున నిలబడ్డారు.
దీనితో ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి గౌరవిస్తే కళాకారుల్లో ప్రభుత్వానికి మద్దతు పెరుగుతుంది అనే భావనలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నట్లుగా సమాచారం. అదేవిధంగా సెటిలర్లలో కూడా ముఖ్యమంత్రి పై గౌరవం పెరిగే అవకాశాలు ఉండవచ్చు. బిఆర్ఎస్(BRS) అధికారంలో ఉన్న సమయంలో కొంతమందికి ఎమ్మెల్సీ టికెట్లతో పాటుగా ఎమ్మెల్యే సీట్లు కూడా కేటాయించింది. ఇది ఆ పార్టీకి కాస్త కలిసి వచ్చిందని చెప్పాలి. ఇప్పుడు ఆర్ నారాయణ మూర్తి, గోరేటి వెంకన్న లాంటి వాళ్లను గౌరవించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇక పేద కళాకారుల కోసం కూడా ఆయన కొన్ని సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టేందుకు అడుగులు వేస్తున్నట్లు రాజకీయ వర్గాలు అంటున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే తెలంగాణ టూరిజం శాఖ ఓ జాబితాను కూడా సిద్ధం చేసినట్లు సమాచారం.