MLC Kavitha: కాంగ్రెస్ డీఎన్ఏలోనే మోసం ఉంది: కవిత
కాంగ్రెస్ (Congress) ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ నిర్వహించిన బీసీ కులగణన లోపభూయిష్టంగా ఉందని ఆమె ఆరోపించారు. ముస్లింలు, బీసీలు కలిపి 56 శాతం ఉండగా, రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రభుత్వం కేవలం 42 శాతమే చూపించిందని మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రత్యేక ఆర్డినెన్స్‌తో బీసీ రిజర్వేషన్లు అమలు చేయవచ్చని, కానీ కాంగ్రెస్ ఆ పనిచేయకుండా ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ (Congress) డీఎన్ఏలోనే మోసం ఉందని, బీజేపిపై ఒత్తిడి తీసుకురాకుండా తమపై విమర్శలు చేయడం తగదని అన్నారు. జైలు జీవితం తనకు ఆత్మగౌరవం ముఖ్యమని నేర్పిందని, అక్కడ పేదల కష్టాలను దగ్గరనుండి చూశానని తెలిపారు. బెయిల్ కోసం డబ్బులు లేక ఎంతో మంది జైల్లోనే మగ్గుతున్నారని అన్నారు. బీఆర్ఎస్ (BRS) పార్టీలో తాను జీవితకాల సభ్యురాలినని, కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు కూడా మహిళా బిల్లు కోసం ఢిల్లీలో ఆందోళన చేశానని గుర్తు చేశారు. తనకూ, కేసీఆర్‌కూ మధ్య కేవలం అభిప్రాయభేదాలు మాత్రమే ఉన్నాయని, గొడవలు లేవని స్పష్టం చేశారు. లేఖ లీక్ చేసిందెవరో తేల్చేవరకూ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. తాను ఎవరికీ పోటీగా సమావేశాలు పెట్టడం లేదన్న కవిత (MLC Kavitha).. పార్టీకి గానీ, కేసీఆర్‌కు గానీ ఎప్పటికీ నష్టం చేయనని హామీ ఇచ్చారు.







