Sridhar Babu: కాంగ్రెస్ వైపే జూబ్లీహిల్స్ ఓటర్లు: మంత్రి శ్రీధర్ బాబు
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ప్రతిపక్షాలకు భంగపాటు తప్పదని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు (Sridhar Babu) అన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం సోమాజిగూడ డివిజన్ పరిధిలోని వివిధ కాలనీలు, బస్తీల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ (Naveen Yadav)కు మద్దతుగా ఆయన విస్తృత ప్రచారం నిర్వహించారు. అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీల అసోసియేషన్లతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని పోయే కాంగ్రెస్ పార్టీ వైపే నియోజకవర్గ ఓటర్లంతా ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ హయాంలోనే హైదరాబా ద్ (Hyderabad) నగరాభివృద్ధికి బాటలు పడ్డాయని, వివిధ ప్రాజెక్టులు చేపట్టినట్లు ఈ సందర్భంగా వివరించారు. పదేళ్ల బీఆర్ఎస్ (BRS) పాలనలో నగరాన్ని గాలికొదిలేశారని మండిపడ్డారు. తమ ఉనికిని కాపాడుకునేందుకు బీఆర్ఎస్, బీజేపీలు బురద జల్లే రాజకీయాలకు పాల్పడుతున్నాయని ఆయన అన్నారు.






