Minister Ponguleti: ప్రజాప్రభుత్వానికి అండగా నిలవండి :మంత్రి పొంగులేటి
ప్రభుత్వంపై కొందరు చేస్తున్న కారుకూతలకు జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాలు చెంపపెట్టు వంటి సమాధానమని తెలంగాణ రాష్ట్ర గృహనిర్మాణ, రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (onguleti Srinivas Reddy) తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు పట్టణంలో రూ.15 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో పొంగులేటి మాట్లాడుతూ ఈ ఉపఎన్నిక ఫలితాలపై కొందరు ఇప్పటికీ తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ (BRS) నేతలను ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వ హయాంలో మంజూరైన డబుల్ బెడ్రూం ఇళ్లలో సుమారు లక్ష ఇళ్లు పునాదులకే పరిమితమయ్యాయని, ఈ పరిస్థితి వారి పనితీరుకు అద్దం పడుతోందని ఎద్దేవా చేశారు. అలాంటి వారు, నిత్యం పేదల కోసం పని చేస్తున్న తమ ప్రజాప్రభుత్వంపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ (Congress) అధికారంలోకి వచ్చాక ఇందిరమ్మ ఇళ్ల కోసం రూ.25,500 కోట్లు కేటాయించామని, నాలుగున్నర లక్షల ఇళ్లను ఇప్పటికే మంజూరు చేశామని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల (Indiramma’s house) ద్వారా పేదలకు ఎంతగానో మేలు జరుగుతోందన్నారు. సీఎం రేవంత్రెడ్డి సారథ్యంలోని ప్రజాప్రభుత్వాన్ని ఆదరించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ పథకం కింద ఇళ్లు మంజూరైన 243 మంది ఎస్టీ లబ్ధిదారులకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాంనాయక్, ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, ఉన్నతాధికారులు, తదితరులు పాల్గొన్నారు.






