తెలంగాణలో తైవాన్ పెట్టుబడులు
తెలంగాణ రాష్ట్రంలో తైవాన్ పెట్టుబడులకు ప్రత్యేక పారిశ్రామిక పార్కును ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. మంత్రితో సమావేశమైన తైవాన్ ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ మాన్యుఫాక్యరర్స్ అసోయేషన్ (టీఈఈఎంఏ) తైపీ ఎకనామిక్ అండ్ కల్చరల్ సెంటర్ (టీఈసీసీ) సభ్యుల బృందానికి ఆయన ఈ విషయాన్ని తెలియజేశారు. తెలంగాణలో పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం టిఎస్ఐపాస్ ద్వారా సులభంగా అనుమతులు ఇవ్వడంతో పాటు ఐటీ, ఎలక్ట్రానిక్స్, హెల్త్‌కేర్, లైఫ్ సైన్సెస్, ఆటో మొబైల్స్, డిఫెన్స్, ఏరోస్పేస్, స్టార్టప్ రంగలను ప్రోత్సహిస్తున్న తీరు గురించి వారికి వివరించారు. తైవాన్‌కు చెందిన స్టార్టప్‌లు ఎంఎస్ఎంఈలు ( సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు) తెలంగాణలోని టీవర్క్స్, టీహబ్‌తో కలిసి పని చేయాలని కోరారు. సుస్థిరమైన ప్రభుత్వం, ప్రశాంతమైన వాతావరణం అత్యాధునిక మౌలిక వసతులు, అద్భుతమైన మానవ వనరులు ఉన్న తెలంగాణ కొత్త రాష్ట్రమైనప్పటికీ ఈవోడీబీలో అగ్రస్థానంలో కొనసాగుతున్నదని మంత్రి కేటీఆర్ తెలిపారు.
తెలంగాణలో పెట్టుబడులకు ఎంతో సానుకూల వాతావరణం ఉన్నదని భారత్‌లోని తైవాన్ ప్రతినిధి బూ శూన్ గెర్ సంతోషం వ్యక్తం చేశారు. తైవాన్ పరిశ్రమలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు పూర్తి స్థాయిలో సహకరిస్తామని తెలిపారు. ఇప్పటికే ఇక్కడ పెట్టుబడులు పెట్టిన తైవాన్ కంపెనీల విస్తరణకు తోడ్పాటునందిస్తామన్నారు. హైదరాబాద్‌కు రావడం తన సొంత ఇంటికి వచ్చినట్టుగా ఉన్నదని టీఈఈఎంఏ చైర్మన్ రిచర్డ్ లీ హర్షం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్జి జయేశ్ రంజన్, ఎలక్ట్రానిక్స్ విభాగం డైరెక్టర్ సుజయ్ కారంపూరి పాల్గొన్నారు.






