Komatireddy: అన్ని క్లియరెన్స్‌లు వచ్చాక ప్రధాని దృష్టికి : మంత్రి కోమటిరెడ్డి

రీజినల్ రింగ్‌రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్) కు సంబంధించిన అన్ని అనుమతులు రెండు నెలల్లో ఇస్తామని, అన్ని క్లియరెన్స్‌లు వచ్చాక ప్రధాని దృష్టికి తీసుకెళ్తామని కేంద్ర మత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari )హామీ ఇచ్చారని తెలంగాణ రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkat Reddy )తెలిపారు. రీజినల్ రింగ్‌రోడ్డు, హైవేల కోసం గడ్కరీతో సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సంగారెడ్డి-భువనగిరి-చౌటుప్పల్ వరకు ఆర్‌ఆర్‌ఆర్ టెండర్ల పక్రియ పూర్తయింది. దాదాపు 95 శాతం భూ సేకరణ కూడా పూర్తయింది. రూ.వెయ్యి కోట్లతో 12 ఆర్వోబీలు కూడా మంజూరు చేశారు.
హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారి ఆరు లేన్ల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని గడ్కరీ ఆదేశించారు. హైదరాబాద్ (Hyderabad ) నుంచి మచిలీపట్నం(Machilipatnam) వరకు రోడ్డు విస్తరణ ఆలస్యమవుతున్నందున, గుడిమల్కాపూర్ నుంచి విజయవాడ వరకు ఒక ప్యాకేజీ, విజయవాడ నుంచి మచిలీపట్నం వరకు మరో ప్యాకేజీగా విభజించి టెండర్లు పిలవాలని అధికారులను గడ్కరీ ఆదేశించారు. 62 కి.మీ మేర శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్‌కు సంబంధించి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి చర్చిస్తామని కేంద్ర మంత్రి చెప్పారు అని కోమటిరెడ్డి తెలిపారు.