దేశంలోనే సురక్షితం, చౌక నగరం మన హైదరాబాద్ – మంత్రి హరీష్ రావు

హైదరాబాద్‌లో టీ న్యూస్ ఛానల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గోల్డెన్ ప్రాపర్టీ షోను మార్చి 13వ తేదీన రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కోవిడ్ వలన మనతోపాటు ప్రపంచం కూడా బాగా నష్టపోయిందని, తెలంగాణ రాష్ట్రం మాత్రం త్వరగా కోలుకుని అన్నింటా ముందుకు వెళుతోందని అన్నారు. దేశంలోనే ఇతర నగరాలతో పోల్చుకుంటే మన హైదరాబాద్ నగరం చాలా చౌక అని, చాలా సురక్షితం అని, అందుకే ఇక్కడ నివాసం ఉండాలని ఇతర రాష్ట్రాలవారు కూడా అనుకుంటారని చెప్పారు. అలాంటివారి కోసం రియల్ ఎస్టేట్ రంగం కూడా అన్నీ విధాలా ముందుకు సాగుతోందని చెప్పారు. రియల్ ఎస్టేట్ రంగానికి ప్రభుత్వం కూడా ఎంతో మద్దతు ఇస్తోందని కూడా తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణను వేగంగా అభివృద్ధి చేస్తున్నారని, దీంతో ఇన్వెస్టర్లు అంతా హైదరాబాద్‌లోనూ, తెలంగాణలోనూ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారని చెప్పారు. పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలు హైదరాబాద్‌లో తమ వెంచర్లను ప్రారంభిస్తున్నాయని, త్వరలోనే ప్రారంభమయ్యే రింగ్ రోడ్డుతో రియల్ బూమ్ రావడం ఖాయమన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన ధరణి ద్వారా ఎన్నో భూమి సమస్యలు తీరుతున్నాయని గుర్తుచేశారు. ధరణి వల్ల పారదర్శకంగా భూముల రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని, ధరణి వల్ల రియల్ ఎస్టేట్ రంగంలో ఎంతో వెసులుబాటు వచ్చిందన్నారు. నగరంలోని రియల్ ఎస్టేట్ సంస్థలను ఒకే చోటుకు తీసుకువచ్చిన టీ న్యూస్ ఛానల్ వారు ఎంతో అభినందనీయులన్నారు. ఇళ్ళు కొనాలనుకునేవారు, ఇంటిపై ఇన్వెస్ట్ చేయాలనుకునేవాళ్ళు ఈ ప్రాపర్టీ షోకి వచ్చి తమ కోరికను తీర్చుకోవాలన్నారు. అంతకుముందు క్రెడాయ్ (తెలంగాణ) చైర్మన్ రామ్ రెడ్డి మాట్లాడుతూ, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం కోవిడ్ కష్టాల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటోందని, ఇప్పుడు బిజినెస్ కోవిడ్ ముందుకంటే ఎక్కువగా అవుతోందని చెప్పారు. ఈ ప్రాపర్టీ షో ను ఏర్పాటు చేసిన టీ న్యూస్‌ను అభినందించారు.
టీ న్యూస్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ సురేష్‌బాబు, చీఫ్ మార్కెటింగ్ మేనెజర్ ఎన్. ఉపేందర్, ఇన్‌ఫుట్ ఎడిటర్ శ్రీనివాస్ కూడా సభా కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా మంత్రి హరీష్‌రావు అన్నీ స్టాల్స్‌ను సందర్శించారు. తెలుగు టైమ్స్ స్టాల్‌ను కూడా సందర్శించి పత్రిక కాపీలను తిలకించారు. తెలుగుటైమ్స్ ఎడిటర్ చెన్నూరి వెంకట సుబ్బారావు మంత్రి హరీష్‌కు పత్రిక వివరాలను తెలియజేసి, పత్రికను ఆయనకు అందించారు.
ఈ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ షోను రెండురోజులపాటు నిర్వహించారు. ఈ షోలో దాదాపు 55కిపైగా కంపెనీలు తమ స్టాల్స్‌ను ఏర్పాటు చేశాయి. అపర్ణ కన్‌స్ట్రక్షన్స్, వాసవీ గ్రూపు సమర్పణలో మై హోమ్ గ్రూపు భాగస్వామ్యంతో టీ న్యూస్ ఈ ప్రాపర్టీ షోను నిర్వహించింది.
Property Show Inaugural Session Meeting
Harish Rao Visiting Property Show Stalls