Nagoba Jatara :మొదలైన నాగోబా జాతర

దేశంలో రెండో అతిపెద్ద గిరిజన జాతర నాగోబా (Nagoba Jatara) ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లో అట్టహాసంగా ప్రారంభమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సొంత నిధులతో నిర్మించిన మురాడి ఆలయం (Muradi Temple )లో ఉదయం మెస్రం వంశస్థులు ఆలయ పీఠాధిపతి మెస్రం వెంకట్‌రావు (Mesram Venkat Rao) ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధాన్‌లు సంప్రదాయ వాయిద్యాలను వాయిస్తుండగా ఆలయం నుంచి నాయక్‌వాడి మెస్రం ధర్ము నాగోబా దేవుడిని తీసుకుని ప్రధాన ఆలయానికి బయల్దేరారు. అనంతరం అక్కడ నాగోబా మహాపూజలకు శ్రీకారం చుట్టారు.
మెస్రం వంశంలోని 22 తెగలకు చెందిన వారు ఆలయంలో ఆడపడుచులకు మట్టికుండలను అందించారు. వారు వాటిల్లో మర్రిచెట్ల వద్ద ఉన్న కోనేరు నుంచి నీటిని తీసుకొచ్చి మట్టిపుట్టలు తయారు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి వందల మంది ఆదివాసీలు తరలివచ్చారు. ఈ జాతర ఫిబ్రవరి 4వ తేదీ వరకు కొనసాగనుండగా, ముఖ్యమైన దర్బార్ కార్యక్రమం ఈ నెల 31న జరగనుంది. జాతరకు విచ్చేస్తున్న భక్తులందరికీ పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) శుభాకాంక్షలు తెలిపారు. జాతరను వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసిందని తెలిపారు.