McDonald : హైదరాబాద్‌లో మెక్ డొనాల్డ్స్ గ్లోబల్ ఇండియా కార్యాలయం

అమెరికాకు చెందిన మల్టీ నేషనల్ సంస్థ మెక్ డొనాల్డ్స్ (McDonald’s) తెలంగాణ ప్రభుత్వంతో కీలక ఒప్పందం చేసుకుంది. సంస్థ విస్తరణలో భాగంగా మెక్ డొనాల్డ్స్ గ్లోబల్ ఇండియా ఆఫీస్‌ను హైదరాబాద్ (Hyderabad)లో నెలకొల్పనున్నట్లు ప్రకటించింది. 2,000 మంది ఉద్యోగులతో కార్యాలయాన్ని త్వరలో ప్రారంభించనుంది. అసెంబ్లీలోని సీఎం కార్యాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy ) సమక్షంలో సంస్థ చైర్మన్, సీఈవో క్రిస్ కెంప్కెజెన్స్‌కీ (Chris Kempkezenski), సంస్థ ప్రతినిధులు చర్చలు జరిపారు. గ్లోబల్ ఆఫీస్ ఏర్పాటుకు సంబంధించి సంస్థ రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో పెట్టుబడుల ఒప్పందం చేసుకుంది.
ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ.శాంతికుమారి, ఐటీ, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్‌రెడ్డి, సంస్థ గ్లోబల్ బిజినెస్ సర్వీసెస్ అధ్యక్షుడు స్కై అండర్సన్, చీఫ్ గ్లోబల్ ఇంపాక్ట్ ఆఫీసర్ జాన్ బ్యానర్, గ్లోబల్ ఇండియా హెడ్ దేశాంత కైలా తదితరులు పాల్గొన్నారు.