ఎస్సీ వర్గీకరణ లేకుండా ఉద్యోగాల భర్తీ.. రేవంత్ సర్కారుపై మందకృష్ణ మాదిగ ఫైర్!

తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ విమర్శల వర్షం కురిపించారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వమే కాదు, రేవంత్ ప్రభుత్వం కూడా నిర్బంధాలతోనే నడుస్తోందని ఆయన అన్నారు. మాదిగలను నమ్మించేందుకు సీఎం ఎన్నో ప్రకటనలు చేస్తున్నారని, కానీ వాటిని నమ్మే పరిస్థితిలో మాదిగలు లేరని చెప్పారు. ఎస్సీ వర్గీకరణను అమలు చేయకుండానే 11 వేలకు పైగా ఉపాధ్యాయ నియామకాలు భర్తీ చేశారని విమర్శించారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో, ఇప్పటికే ఇచ్చిన నోటిఫికేషన్లకు కూడా వర్గీకరణను వర్తింపజేస్తామని సీఎం చెప్పిన విషయాన్ని గుర్తుచేసిన ఆయన… ఈ వర్గీకరణను మాత్రం సీఎం అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో సీఎం చెప్పిన మాటలకే విలువ లేకుండా పోయిందన్న మంద కృష్ణ.. గ్రూప్ 1, గ్రూప్ 2 పరీక్షలకు వర్గీకరణను వర్తింప చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే వర్గీకరణ తర్వాతే పరీక్షలు నిర్వహించాలని సూచించారు. గ్రూప్ 4 ఫలితాలు ఇప్పటికే 16 నెలలు ఆలస్యం అయ్యాయని, వీటిని వర్గీకరణ జరిగేంత వరకు వాయిదా వేయాలని విజ్ఞప్తి చేశారు.