Judgement: ఫిరాయింపు ఎమ్మెల్యేలపై నేడే తీర్పు.. సర్వత్రా ఉత్కంఠ..!
తెలంగాణ రాజకీయాల్లో ఇవాళ అత్యంత కీలక పరిణామం చోటుచేసుకోబోతోంది. గత కొంతకాలంగా రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తున్న పార్టీ ఫిరాయింపుల వ్యవహారంపై నేడు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తన తుది నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. బీఆర్ఎస్ పార్టీ గుర్తుపై గెలిచి, అధికార కాంగ్రెస్ పార్టీలోకి చేరిన ఐదుగురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నేడు తీర్పు వెలువడనుండటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ మేరకు స్పీకర్ కార్యాలయం నుండి చకచకా సాగుతున్న పరిణామాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.
మొత్తం 10 ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించినట్లు బీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది. అయితే వాళ్లలో ఐదుగురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ ప్రక్రియను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇప్పటికే పూర్తి చేశారు. తాజా సమాచారం ప్రకారం, నేడు తీర్పు వెలువరించడానికి స్పీకర్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సదరు ఐదుగురు ఎమ్మెల్యేల తరఫు అడ్వకేట్లకు స్పీకర్ కార్యాలయం నుంచి అత్యవసర నోటీసులు జారీ అయ్యాయి. ఈరోజు మధ్యాహ్నం 3.30 గంటలకు స్పీకర్ కార్యాలయంలో హాజరుకావాలని ఆ నోటీసుల్లో స్పష్టంగా పేర్కొన్నారు. దీంతో మధ్యాహ్నం వెలువడే నిర్ణయంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది.
ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ తరపున గెలిచి, కాంగ్రెస్ గూటికి చేరిన ఈ కింది ఐదుగురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపైనే నేడు తీర్పు వెలువడనుంది. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిలపై స్పీకర్ విచారణ పూర్తి చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన అనర్హత పిటిషన్లపై న్యాయస్థానం ఆదేశాల మేరకు స్పీకర్ ఈ విచారణ ముగించారు. వాస్తవానికి ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత అంశంపై హైకోర్టు ఇటీవల సీరియస్ గా స్పందించింది. ఒక నిర్దిష్ట గడువులోగా దీనిపై నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ ను ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ న్యాయ కోవిదులతో చర్చించి, విచారణ ప్రక్రియను ముగించారు.
ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారానికి సంబంధించి రెండు ప్రధాన అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం వీరి ఫిరాయింపు చెల్లదని స్పీకర్ భావిస్తే, వారిపై అనర్హత వేటు పడే అవకాశం ఉంది. అదే జరిగితే, ఆ ఐదు నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు అనివార్యమవుతాయి. ఇది తెలంగాణ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేయగలదు. ఇక సాంకేతిక కారణాలతో పిటిషన్లను తిరస్కరించడం లేదా మరికొంత సమయం తీసుకోవడం రెండో అంశం. అయితే, కోర్టు డెడ్ లైన్ ఉన్నందున ఇది ఎంతవరకు సాధ్యమనేది ప్రశ్నార్థకం.
స్పీకర్ నిర్ణయం అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలకు చాలా కీలకం. తమ పార్టీ గుర్తుపై గెలిచి పార్టీకి ద్రోహం చేసిన వారిపై అనర్హత వేటు వేయాల్సిందేనని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న కాంగ్రెస్ వైఖరిని వారు ఎండగడుతోంది. అభివృద్ధి కోసమే ఎమ్మెల్యేలు తమతో కలిసి వస్తున్నారని కాంగ్రెస్ చెబుతున్నప్పటికీ, న్యాయపరమైన చిక్కులు వారిని ఇబ్బంది పెడుతున్నాయి. ముఖ్యంగా అరికెపూడి గాంధీ వంటి సీనియర్ నేతలపై అనర్హత వేటు పడితే అది ప్రభుత్వానికి రాజకీయంగా ఇబ్బందికర పరిణామమే.
మొత్తానికి, మధ్యాహ్నం 3.30 గంటలకు అడ్వకేట్లతో భేటీ అనంతరం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఏం ప్రకటించబోతున్నారు? అనర్హత అస్త్రాన్ని ప్రయోగిస్తారా? లేక ఈ ‘ఆయారాం.. గయారాం’ రాజకీయానికి మరో ట్విస్ట్ ఇస్తారా? అన్నది తేలిపోనుంది. ఒకవేళ అనర్హత వేటు పడితే మాత్రం, ఐదు నియోజకవర్గాల్లో మినీ యుద్ధానికి తెరలేచినట్లే. తీర్పు ఎలా ఉన్నా, అది రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయాల్లో, న్యాయ పోరాటాల్లో కీలక మలుపు కానుంది.






