Mahesh Kumar Goud: మరో 20 ఏళ్లు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వమే: మహేశ్ కుమార్ గౌడ్

ప్రొఫెసర్ కోదండరాం, అమెర్ అలీఖాన్‌లను ఎమ్మెల్సీలుగా నియమిస్తూ తెలంగాణ గవర్నర్ తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు రద్దు చేయడంపై టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) స్పందించారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు తుది తీర్పు తర్వాత ఏం చేయాలనేది ఆలోచిస్తామని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే కట్టుబడి ఉంటుందని, పొత్తులో భాగంగా కోదండరాంకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చామని ఆయన వివరించారు. కేసీఆర్ (KCR) కంటే ప్రొఫెసర్ కోదండరాం ఎక్కువ ఉద్యమం చేశారని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కోదండరాం చట్టసభల్లో ఉండటం అవసరమని అన్నారు. అలాగే, తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందంటే చిన్నపిల్లాడు కూడా నవ్వుతాడని ఆయన (Mahesh Kumar Goud) విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ పని కూడా అయిపోయిందని, మరో 20 ఏళ్ల పాటు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీదే అధికారమని మహేశ్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు.