Krishna Rao: సిట్టింగ్ జడ్జితోనైనా విచారణకు నేను సిద్ధం
తనపై శేరిలింగంపల్లి ఎమ్మెల్యే చేసిన ఆరోపణలపై ఏ సిట్టింగ్ జడ్జి (Judge) తోనైనా విచారణకు సిద్ధమని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు (Madhavaram Krishna Rao) ప్రతి సవాల్ విసిరారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కృష్ణారావు మాట్లాడుతూ ఇల్లు, కాలేజీ, సీలింగ్ ల్యాండ్, మఠం ల్యాండ్, కేపీహెచ్పీ భూములుపై విచారణ చేయాలని, ఈ విషయంలో తాను భయపడే వ్యక్తిని కాదని అన్నారు. అరికపూడిగాంధీ (Arikapudi Gandhi) ఎస్టేట్ ఎవరిదో విచారణ జరిపిద్దామని డిమాండ్ చేశారు.
మీ పాత్ర లేకుండానే సర్వేనంబర్ 57 ప్రైవేట్ భూమి అవుతుందా అని ఎమ్మెల్యే గాంధీని ప్రశ్నించారు. పేదల భూములు కూలిస్తే కరెక్టు, మీ భూములు కూలిస్తే హైడ్రా తప్పు ఎలా అవుతుంది. హైడ్రా కమిషనర్ చేసేది తప్పా, అలా అయితే మీకు వ్యతిరేకంగా హైడ్రా హైకోర్టులో ఎందుకు పోరాడుతుందని అన్నారు. ఈ విషయంలో ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసి పూర్తి విచారణ జరిపించండని సవాల్ విసిరారు. ఎమ్మెల్యే అయి ఉండి ప్రీ లాంచ్ పేరిట అనుమతి లేని ప్లాట్లను విక్రయించింది ఎవరని ఆయన ప్రశ్నించారు. రాజకీయాల్లో కుటుంబ విషయాలు మాట్లాడటం తగదని హితవు పలికారు.






