BRS: లోకేష్ బాటలో కేటీఆర్ … బీఆర్ఎస్ లో ఏం జరుగుతోంది..?

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, కేసీఆర్ (KCR) తర్వాత పార్టీని ముందుండి నడిపిస్తున్న నేత.. అలాంటి కేటీఆర్ (KTR) మొన్నటివరకూ సాఫ్ట్ గా , క్లియర్ కట్ గా మాట్లాడేవారు. ఇప్పుడు మాత్రం రఫ్ గా కామెంట్స్ చేస్తున్నారు. అంతే కాదు… ప్రత్యర్థులపై ముతకభాష మాట్లాడుతున్నారు. అంతేకాదు.. తాను గులాబీ బాస్ లా మంచోడిని కాదని.. ఆయన చెప్పినా కూడా విననని స్పష్టం చేశారు. ఈమాటలతో గులాబీ శ్రేణుల్లో కూడా కేటీఆర్ వ్యవహారశైలిపై చర్చ జరుగుతోంది.
2024 ఎన్నికలకు ముందు వరకూ నారా లోకేష్ సైతం .. స్మూత్ గా వ్యవహరించేవారు. ఆచితూచి స్పందించేవారు. కానీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ తన ఇమేజ్ మార్చేశారు. తాత,తండ్రిలా కాదని.. తాను చాలా టఫ్ గా ఉంటానని పదేపదే యువగళంలో ప్రస్తావించారు. అంతేకాదు… తన పాదయాత్రలో ఇబ్బందులు సృష్టించిన పోలీసులకు సైతం.. ఇదే తేల్చి చెప్పారు. తాను రెడ్ బుక్ తయారు చేస్తున్నానని.. అధికారంలోకి వచ్చిన తర్వాత కచ్చితంగా తప్పు చేసినవారిని చట్టపరంగా శిక్షిస్తామని చెప్పుకొచ్చారు.
ఇప్పుడు ఏపీలో విపక్షనేతలు ఒకొక్కరుగా జైలుకెళ్తున్నారు. కోర్టు కేసుల్లో తిరుగుతున్నారు. వారందరూ చెప్పేది ఒక్కటే.. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందని.. దీనికి లోకేష్ కూడా అదేస్థాయిలో కౌంటరిస్తున్నారు. అప్పుడే చెప్పాం.. తప్పు చేసిన వారు చట్టపరంగా శిక్ష అనుభవించక తప్పదని అంటూ గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు కేటీఆర్ కూడా పోలీసులకు అదేవిధంగా వార్నింగిస్తున్నారు.మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న పోలీసులపై కచ్చితంగా చర్యలు తీసుకుంటామని కేటీఆర్ హెచ్చరించారు. సీఐలు, ఏసీపీలు ఎవరెవరైతే ఎగిరి పడుతున్నారో.. వారందరి సంగతి చూద్దామని.. తాను గులాబీ పార్టీ అధినేత లాగా మంచోడిని కాదని.. ఆయన చెప్పినా కూడా విననని కేటీఆర్ స్పష్టం చేశారు.
ఇప్పుడే కాదు గత కొద్దిరోజులుగా కేటీఆర్ వ్యవహార శైలి ఇలాగే ఉంటున్నది. అధికార పక్షం మీద, పోలీసుల మీద ఆయన ఒంటి కాలు మీద లేస్తున్నారు. సమయం, సందర్భం తో పని లేకుండానే తిట్టడాన్నే పనిగా పెట్టుకుంటున్నారు. ఏకవాక్య సంబోధనతో ముఖ్యమంత్రిని విమర్శిస్తున్నారు… ఆయన చేసిన వ్యాఖ్యలను ఆ పార్టీ నాయకులు సోషల్ మీడియాలో తెగ ట్రోల్ చేస్తున్నారు. ఇక్కడేదో కాంగ్రెస్ పార్టీ నాయకులు సుభాషితాలు మాట్లాడుతున్నారని కాదు.. వీరు అదే తరహాలో మాట్లాడుతున్నారు.
ఇటీవల ఫార్ములా ఈ కేసు వ్యవహారంలో కల్వకుంట్ల తారక రామారావును అధికారులు పలుమార్లు విచారించారు. విచారణకు హాజరయ్యే క్రమంలో బల ప్రదర్శన చేపట్టారు. ఎక్కడెక్కడ నుంచో నేతలను తీసుకొచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయించారు. వాస్తవానికి కేటీఆర్ ఏ తప్పూ చేయకుంటే ఈ స్థాయిలో బల ప్రదర్శన చేయాల్సిన అవసరం ఏముందని కాంగ్రెస్ నాయకులు అప్పట్లో ప్రశ్నించారు. కేటీఆర్ మాత్రమే కాదు, కేసిఆర్ కాలేశ్వరం విచారణకు హాజరైన సమయంలోనూ ఇదే స్థాయిలో బల ప్రదర్శన చేపట్టారు.