KTR: ఆ రోజులు తెస్తామని.. రైతులకు అవస్థలు తెచ్చారు: కేటీఆర్

తెలంగాణలో యూరియా కొరతపై భారత రాష్ట్ర సమితి (BRS) నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 2025లో రాష్ట్రంలో నెలకొన్న యూరియా సంక్షోభంపై BRS కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (KTR) వ్యంగ్యంగా స్పందించారు. 2014కు ముందు రైతులు అర్ధరాత్రి విద్యుత్ కోసం బావుల వద్ద పడిగాపులు కాసే దుస్థితి ఉండేదని గుర్తుచేసిన ఆయన.. ఇప్పుడు యూరియా బస్తాల కోసం ఎరువుల దుకాణాల అరుగుల మీద పడుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ‘ఆనాటి రోజులు మళ్లీ తెస్తామని’ చెప్పి, నిజంగానే రైతుల కష్టాలను పునరావృతం చేసిందని ఆయన (KTR) విమర్శించారు.
మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) కూడా ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా యూరియా కొరతతో రైతులు పడుతున్న బాధలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. మహబూబాబాద్ జిల్లా గూడూరులో యూరియా కోసం రైతులు పడుతున్న అవస్థలను ఉదహరిస్తూ.. “ముసురు వానలో రోడ్డెక్కిన రైతన్న… మొద్దు నిద్రలో రేవంత్ రెడ్డి సర్కార్” అని మండిపడ్డారు. యూరియా కూడా సరఫరా చేయలేని ఈ “ప్రజాపాలన” అభయహస్తం కాదని, రైతన్నల పాలిట భస్మాసుర హస్తంగా మారిందని హరీశ్ రావు (Harish Rao) తీవ్రంగా దుయ్యబట్టారు.