KTR: రాష్ట్రంలో కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం మేమే : కేటీఆర్
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం చూస్తే బీజేపీ, కాంగ్రెస్ కుమ్మక్కు రాజకీయం ఫలించినట్టే కనిపిస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. ఉప ఎన్నికల ఫలితం వెల్లడైన అనంతరం తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. బీజేపీ (BJP)కి డిపాజిట్ కూడా రాలేదని, ఆర్ఎస్ బ్రదర్స్ (RS Brothers) సమీకరణం బాగానే పనిచేసిందని తెలిపారు. ఎన్నికలకు ముందు అన్ని సర్వేలు బీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పాయని, ఆఖరి మూడు రోజుల్లో ఏం జరిగిందో, ఎన్నికలు ఎలా జరిగాయో ప్రతి ఒక్కరూ చూశారన్నారు. అయినప్పటికీ పార్టీకి గణనీయమైన ఓట్లు వచ్చాయన్నారు. ప్రజా తీర్పును గౌరవిస్తామని, ఫలితంపై ఆత్మవిమర్శ చేసుకుంటామని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం భారత రాష్ట్ర సమితియే అని ఈ ఉప ఎన్నిక ద్వారా ప్రజలు తీర్పు ఇచ్చారు అని అన్నారు.
మా అభ్యర్థి మాగంటి సునీతకు రాజకీయ అనుభవం లేకపోయినా, గెలుపు కోసం పోరాడారు. ప్రభుత్వ వైఫల్యాలను, ఆరు గ్యారంటీల అమలులో మోసాన్ని ఎన్నికల సందర్భంగా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాం. మా ఒత్తిడి కారణంగానే గ్యారంటీల అమలుపై సీఎం సమీక్షించారు. మంత్రివర్గంలో మైనారిటీలకు స్థానం లేదని గళమెత్తితే అజారుద్దీన్‌కు పదవి ఇచ్చారు. ఈ ఫలితం మా పార్టీకి చిన్న ఎదురుదెబ్బే. నిరాశ చెందాల్సిన అవసరం లేదు. కేసీఆర్ తిరిగి సీఎం చేసేవరకు పోరాడుతూనే ఉంటాం. ఉప ఎన్నిక ఎలా జరిగిందో చర్చ జరగాల్సిన అవసరం ఉంది. నకిలీ ఓటరు కార్డుల పంపిణీ, షెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచి పోలింగ్ రోజు వరకు జరిగిన అక్రమాలపై ఎన్నికల కమిషన్‌కు ఎప్పటికప్పుడు ఫిర్యాదు చేశాం. స్వయంగా కాంగ్రెస్ అభ్యర్థి తమ్ముడికే మూడు ఓట్లున్నాయి. ఎన్నికల కమిషన్, పోలీసుల పనితీరుపై చర్చ జరగాలన్నారు.






