Komatireddy: తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత పోరు.. సీఎం రేవంత్ రెడ్డిపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఫైర్!

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో (Telangana Congress) అంతర్గత కలహాలు మరోసారి తెరపైకి వచ్చాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) చేసిన ఒక ప్రకటనపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajagopal Reddy) తీవ్రంగా స్పందించారు. “రాబోయే పదేళ్లు నేనే ముఖ్యమంత్రిని” అని రేవంత్ రెడ్డి ప్రకటించుకోవడం కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకమని, జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్‌లో ముఖ్యమంత్రి ఎన్నిక అధిష్ఠానం ఆదేశాల మేరకు ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతుందని కోమటిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ కాంగ్రెస్‌ను రేవంత్ వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చే ప్రయత్నాలను నిఖార్సయిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సహించబోరని హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు తెలంగాణ కాంగ్రెస్‌లో కొత్త వివాదానికి తెరలేపాయి.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్‌లో సీనియర్ నాయకుడిగా ఉన్నారు. మునుగోడు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. గతంలో భువనగిరి లోక్‌సభ సభ్యుడిగా పనిచేశారు. ఆ తర్వాత కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరిన ఆయన, 2023లో మళ్లీ కాంగ్రెస్‌లోకి తిరిగి వచ్చి మునుగోడు నుంచి గెలిచారు. ఆయన కేబినెట్ లో చోటు ఆశించారు. అయితే మొదటి నుంచి కాంగ్రెస్ లోనే కొనసాగుతున్న సోదరుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి కేబినెట్ లో స్థానం లభించింది. దీంతో ఒకే ఇంట్లో ఇద్దరికి మంత్రి పదవులు ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి రాజగోపాల్ రెడ్డిని పక్కన పెట్టారు. అయితే కాంగ్రెస్ హైకమాండ్ ఓకే చెప్పినా, రేవంత్ రెడ్డి దానిని అడ్డుకున్నారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భావిస్తున్నట్టు సమాచారం. అయితే ఒకవేళ కాంగ్రెస్ హైకమాండ్ అలా నిర్ణయిస్తే రేవంత్ రెడ్డి దాన్ని అడ్డుకోలేరని కాంగ్రెస్ నేతలే అభిప్రాయపడుతున్నారు.
రేవంత్ రెడ్డి నాయకత్వంలో 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ 64 సీట్లతో అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి నాయకత్వం, ఆయన దూకుడు విధానాలు కాంగ్రెస్‌కు ఈ విజయాన్ని తెచ్చిపెట్టాయని అనేక మంది భావిస్తున్నారు. అయితే, రేవంత్ రెడ్డి వ్యక్తిగత నిర్ణయాలు, పదవీకాలం గురించి చేసిన వ్యాఖ్యలు పార్టీలోని సీనియర్ నాయకుల్లో అసంతృప్తిని రేకెత్తిస్తున్నాయి. రేవంత్ రెడ్డి పదేళ్ల సీఎం ప్రకటన వెనుక ఆయన ఆత్మవిశ్వాసం, పార్టీని మళ్లీ అధికారంలోకి తెచ్చే లక్ష్యం ఉండవచ్చు. అయితే, ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ లో చాలా మందికి నచ్చకపోవచ్చు. కాంగ్రెస్ సంప్రదాయం ప్రకారం, ముఖ్యమంత్రి ఎన్నిక శాసనసభ్యుల అభిప్రాయాలు, అధిష్ఠానం నిర్ణయాల ఆధారంగా జరుగుతుంది. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఈ సంప్రదాయానికి విరుద్ధంగా ఉన్నాయని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. ఈ వివాదం తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలను మరింత పెంచే అవకాశం ఉంది.
అయితే కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి కొత్తేమీ కాదు. గతంలోనూ, రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడిగా నియమితులైనప్పుడు కొందరు సీనియర్ నాయకులు వ్యతిరేకించారు. అయినప్పటికీ, రేవంత్ నాయకత్వంలో పార్టీ బలపడిందని, ఆయన వల్లే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని ఆయన సన్నిహితులు వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వంటి నాయకుల విమర్శలు పార్టీలో అంతర్గత పోరును తెరపైకి తెస్తున్నాయి. మంత్రివర్గ విస్తరణ, పదవుల పంపకం విషయంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఆయన రేవంత్‌పై విమర్శలు గుప్పించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.